January 16, 2013

డ్వాక్రా మహిళలకు వడ్డీ వాపస్



టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళలకు వారు చెల్లించిన వడ్డీని తిరిగి చెల్లిస్తామని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హమీ ఇచ్చారు. ముదిగొండ మండలం వల్లభిలో పొట్ల వెంకటప్రసాద్ అధ్వర్యంలో టీడీపీ నాయకులు చంద్రబాబు పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్రలో బంతిపూల వాన కురిపించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే 6నెలల్లో పాలన గాడిలో పెట్టడంతోపాటు కల్లు గీతకార్మికులకు ప్రతి గ్రామంలో 10 ఎకరాలు తాటి, ఈత వనాలు పెంచేందుకు భూమి ఇస్తామన్నారు. గొర్రెల కాపరులకు గొర్రెలను మేపుకునేందుకు 5నుంచి 10ఏకరాలు భూమితోపాటు, గొర్రెలకు ఉచితంగా మందులు ఇస్తామని హామీ ఇచ్చారు. చదువుకున్న వారందరికి వారి విద్యార్హతలు, నైపుణ్యాన్ని బట్టి ఉపాధి, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. అగ్రవర్ణాల పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పించి చేయూతనిస్తామని ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు మరోసారి పునరుద్ఘాటించారు. వర్గీకరణ చేయించి విద్యాఉద్యోగ అవకాశాల్లో న్యాయం చేస్తామని చెప్పారు.

గతంలో టీడీపీ హయాంలో ఎస్సీ వర్గీకరణ వల్ల ఎందరికో ఉద్యోగావకాశాలు లభించాయని చంద్రబాబు గుర్తుచేశారు. టీడీపీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. బెల్ట్ షాపులు రద్దు చేసి మద్యం అమ్మకాలను నియంత్రిస్తామని చెప్పారు. వ్యవసాయ పనులకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తానని ప్రకటించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు గోదావరి, కృష్ణా నీరు అందించి తాగు నీటి కష్టాలు లేకుండా చేస్తామన్నారు. ఈ సభలో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు దోపిడీ పార్టీలని చంద్రబాబు విమర్శించారు. వైఎస్ జగన్ లక్ష కోట్లు దోపిడీ చేసి జైల్‌కు వెళ్లాడు. ఇప్పటికే సీబీఐ విచారణలో రూ.43వేల కోట్ల సంపద బయటపడింది. ఆయన్ని విడిపించేందుకు విజయలక్ష్మి కోటి సంతకాల పేరుతో రాష్ట్రపతి వద్దకు వెళ్లటం సిగ్గు చేటని, అవినీతికి వ్యతిరేకంగా యువత సెల్ మేసెజ్‌లతో యుద్ధం చేసి అవినీతిపరుల గుండెల్లో నిద్రపోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరి ముఖ్యమంత్రి అని, తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారు. 'కాంగ్రెస్ పాలన రాక్షస పాలనగా మారింది. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క కూడా తప్పుడు కేసులు, అరెస్టులతో రాజకీయం చేస్తున్నారని, వీరి కేసులకు భయపడేదిలేదని హెచ్చరించారు. ఈ సభలో మాజీ మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఊకే అబ్బయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, నాయకులు స్వర్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు.

పండగపూటా.. ఆగని పాదయాత్ర

పల్లెలు పచ్చగా ఉన్నప్పుడే అసలైన పండుగ. ప్రజల ఇబ్బందులు తీరినప్పుడే తనకు నిజమైన పండుగ అని భావించిన బహుదూరపు పాదచారి చంద్రబాబు సోమ, మంగళవారాల్లో పండుగ రోజూ పాదయాత్ర కొనసాగించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వస్తున్నా.. మీకోసం పాదయాత్ర సోమవారం మకర సంక్రాంతి, మంగళవారం కనుమ రోజుల్లో కూడా య«థావిధిగా కొనసాగింది. సోమవారం కాస్త ఆలస్యంగా యాత్ర మొదలుపెట్టిన బాబు మొదట ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామశివారు మామిడి తోటలో రైతులతో సమావేశమై వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. గిట్టుబాటు ధరలు రావటం లేదని, విత్తనాలు, ఎరువులు కల్తీతోపాటు అధిక ధరలు భరించలేకపోతున్నామని చంద్రబాబు ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. బాబు స్పందిస్తూ.. ప్రభుత్వానికి అన్నదాతల ఉసురు తగిలితీరుతుందన్నారు. రైతుల క్షోభ దేశానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. నీటి ఇబ్బంది నివారణకు సూక్ష్మ సేద్య విధానాన్ని అవలంబించాలని సూచించారు. తాను అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు తీరుస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం చిరుమర్రి, వనంవారి కృష్ణాపురం గ్రామాల మీదుగా అమ్మపేట చేరుకొని స్థానిక రవీంద్రభారతి స్కూల్‌లో రాత్రి బస చేశారు. మంగళవారం కనుమ పండుగ రోజూ బాబు పాదయాత్ర కొనసాగింది. ప్రజలకు సుపరిపాలన కావాలంటే సమర్ధ నేత అధికారంలో ఉండాలని విద్యార్థులకు బాబు వివరించారు. అనంతరం కమలాపురం బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి రావటం ఒక చారిత్రక అవసరమన్నారు. తరువాత బాణాపురం సమీపంలో పొలాల్లో వరినాట్లు వేస్తున్న కూలీలతో మాట్లాడారు. వారిసమస్యలు అడిగి తెలుసుకున్నారు. మిర్చి రైతులతోనూ ముచ్చటించారు. మధ్యాహ్న భోజనం అనంతరం ముదిగొండ శివారు వల్లభిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. జిల్లాలో చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర కార్యక్రమం మంగళవారం ఏడో రోజు 9 కిమీ సాగింది. ముదిగొండ మండలం అమ్మపేట నుంచి కమాలాపురం, అయ్యగారిపల్లి, బాణాపురం, పెద్దమండవ క్రాస్ రోడ్డు, వల్లభి వరకు సాగింది. రాత్రికి నేలకొండపల్లి మండలం అప్పలనర్సాపురంలో చంద్రబాబు బస చేశారు. ముదిగొండ మండలంలో అన్ని గ్రామాల్లో బాబుకు ఘన స్వాగతం లభించింది. అమ్మపేట రవీంద్రభారతి పాఠశాలలో చంద్రబాబు ముచ్చటిస్తూ.. విద్యార్థులందరికీ సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అమ్మగారిపల్లిలో రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తామని ప్రకటించారు.

నేడు బాబుయాత్ర ఇలా

వస్తున్నా మీ కోసం యాత్ర బుధవారం నేలకొండపల్లి మండలం అప్పలనర్సింహపురం నుంచి ప్రారంభమవుతుంది. రాయిగూడెం, చెరువు మాదారం వరకు చేరి రాత్రికి అక్కడే బస చేస్తారు.