January 16, 2013

ప్రతి పాలకుడికీ చెంపదెబ్బే!



మద్యం మహమ్మారి పల్లెలను మింగేస్తోంది. పేదలను ముంచేస్తోంది. చాలా కుటుంబాలకు గంజి కూడా లేకుండా చేస్తోంది. కష్టం చేయడంలో మగవారికి ఎక్కడా తీసిపోరు నా ఆడపడుచులు. మొగుడు పనిచేసినా, చేయకున్నా ఇంటిని ఒక్క చేతి మీదే నడిపించగల మనోధైర్యం వాళ్ల సొంతం. ఇప్పుడు వాళ్లంతా బేజారవుతున్నారు. ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి వెళ్లినప్పుడు అటువంటి కొందరు నన్ను కలిశారు. వంద కూలీలో యాభై రూపాయలు మొగుడు తాగుడుకే పోతోందని, ఇంక ఏమి పెట్టి కుటుంబాన్ని పోషించాలని వాళ్లంతా వాపోయారు.

పగలంతా పనిచేసి అలిసిపోయిన తమకు.. తాగొచ్చిన భర్తల వేధింపులు, చిత్రహింసలు తప్పడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. బెల్టుషాపుల గురించి మాట్లాడేప్పుడు ఆ ఆడపడుచులు ఒక్కొక్కరు ఒక్కో కాళికామాతను తలపించారు. వాళ్లు పడుతున్న ఆవేదన నాకు తెలియనిదేమీ కాదు. ఆరోగ్యంతో పాటు ఆర్థికంగానూ దెబ్బతిన్న కుటుంబాలెన్నో నాకు తెలుసు. కల్తీ మద్యం తాగి యువకులు చనిపోతే, లేత వయసులోనే వితంతువులవుతున్న ఆడపిల్లల దైన్యాన్ని కళ్లారా చూశాను. అందుకే యాత్ర ప్రారంభంలోనే.. బెల్టుషాపుల రద్దు నిర్ణయం ప్రకటించాను.

నా రెండో సంతకం బెల్టు షాపుల రద్దుపైనే ఉంటుందని నేను వెళ్లిన ప్రతి సభలోనూ పదేపదే చెబుతున్నాను. అలాంటి ఒక సభలో ఓ యువకుడు నా దగ్గర తప్పు ఒప్పుకున్నాడు. పేరు కోటేశ్వరరావు అని చెప్పాడు "తాగుడు మానలేకపోతున్నాను సార్. తాగినప్పుడే నేను చెడ్డోణ్ని. విడప్పుడు మాత్రం మంచిగానే ఉంటాను. ఈ మద్యాన్ని నియంత్రించి పుణ్యం కట్టుకోండి'' అని వేడుకున్నాడు. దీనిపై గట్టి నిర్ణయం తీసుకునేందుకు ఆ యువకుడి మాటలు ప్రేరణగా నిలుస్తున్నాయి.

బానాపురం వద్ద నాట్లు వేస్తున్న కూలీలు కనిపించారు."ఈ కోతలతో పంట కాదు కంట నీరే మిగులుతోంది. పనులు లేవు. పిల్లల చదువులు సాగడం లేదు. కూలి చేస్తే వచ్చేది బెత్తెడు. పెరిగిన ధరలతో ఖర్చులేమో బారెడు. ఏమి తిని బతకాలి సార్''అని దీనంగా ప్రశ్నించారు. వరిపొలాల్లో నిలబడి వాళ్లడిగిన ఈ ప్రశ్న ప్రతి పాలకుడికీ చెంపదెబ్బే!