December 11, 2012

తెలంగాణ వస్తే కేసీఆర్‌కు భవిష్యత్తు లేదు: చంద్రబాబు

అందుకే రాష్ట్రం కోరుకోవడం లేదు
కాంగ్రెస్‌తో కలిసి డ్రామాలాడుతున్నాడు
నాన్చుడు సోనియాను ఒక్క మాట అనడేం?
టీఆర్ఎస్ అధినేతపై చంద్రబాబు నిప్పులు
అఖిలపక్షంలో ఏం చెప్పాలో అదే చెబుతాం
అన్ని పార్టీలూ నా దారిలోకే..
ఆదిలాబాద్‌లో పాదయాత్రకు బ్రహ్మరథం

ఆదిలాబాద్, డిసెంబర్ 11 : " తెలంగాణ ఇస్తే కేసీఆర్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు. అందుకే ఆయన తెలంగాణ రావాలని కోరుకోవడం లేదు'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తేల్చాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణపై నాన్చుడు ధోరణి అవలంభిస్తుండగా, ప్రశ్నించాల్సిన టీఆర్ఎస్.. టీడీపీను దెబ్బతీయాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఆదిలాబాద్ జిల్లా సిర్గాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఆయన మంగళవారం పాదయాత్ర ప్రారంభించారు.

చిట్యాల క్రాస్‌రోడ్, తల్వెద క్రాస్‌రోడ్, మంజులాపూర్, నిర్మల్ పట్టణంలోని ఈద్గా చౌరస్తా, రూరల్ పోలీస్ స్టేషన్, మంచిర్యాల క్రాస్‌రోడ్, శాంతినగర్ చౌరస్తా, వెంకటాపూర్, అక్కాపూర్, మూక్తాపూర్ వరకు 14.8 కిలో మీటర్లు నడిచారు. ప్రజల్లో మమేకం అవుతూ, వైసీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌లపై పలు సభల్లో నిప్పులు చెరుగుతూ చంద్రబాబు ముందుకు సాగారు. నిర్మల్ నియోజక వర్గంలో జనం ఆయనకు నీరాజనం పలికారు. పలు వివిధ గ్రామాల ప్రజలు డప్పు చప్పుళ్లతో, మేళ వాయిద్యాలతో, మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు.

వెంకటాపూరం గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు." కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయి. తెలంగాణ వస్తే కేసీఆర్‌కు రాజకీయ భవిష్యత్తు ఉండదు. అందుకే తెలంగాణ రావాలని కోరుకోవడం లేదు. తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్నాడు.కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై ఒక్క మాట కూడా మాట్లాడడు. తెలంగాణ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఉద్యమం చేపడుతున్న కేసీఆర్ అధికార పార్టీపై పోరాడాలి. అలాగని ప్రతిపక్షాలపై పోరాడం ఎలా సమంజసం?'' అని ప్రశ్నించారు.

అఖిలపక్షం సమావేశంలో తమ పార్టీ ఏం చెప్పాలో అదే చెబుతుందన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ.. తన అభిప్రాయం చెప్పకుండా నాటకాలు ఆడుతుందన్నారు. తమ పార్టీ ప్రజల మనోభావాలను గౌరవిస్తుందని చెప్పారు. కొత్త కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే కొత్త రాగాలు ఆలపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ విషయంపై తేల్చడానికి కాక, అవగాహనల కోసమనీ, కొత్త విషయాలను తెలుసుకునేందుకనీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

టీడీపీకి ఓటేస్తే తెలంగాణ వస్తుందనీ, అప్పుడు సీమాంధ్రులు పాస్‌పోర్ట్, వీసా తీసుకొని తెలంగాణకు వెళ్లాల్సి ఉంటుందని 2009 ఎన్నికల్లో వైఎస్ చేసిన ప్రచారాన్ని ఆయన గుర్తుచేశారు. దానివల్ల మూడు, నాలుగు శాతం ఓట్లు తగ్గి అధికారానికి దూరమయ్యామని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పాలనలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌ను తాను అభివృద్ధి చేయడంతో ఆదాయం పెరిగిందనీ, ఆ పెరిగిన ఆదాయాన్ని కాంగ్రెస్ నాయకులు దోచుకు తింటున్నారని విమర్శించారు. ఎప్పుడైనా తనదారికే మిగతా పార్టీలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలూ రైతులూ కోరితే రుణాలు మాఫీ చేస్తామని కేసీఆర్ ప్రకటించడాన్ని ఆయన గుర్తుచేశారు.

ఆలాగే.. బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ముందు విముఖత చూసి.. తమ పోరాటం తరువాత కేసీఆర్ మేల్కొన్నారని చెప్పారు. అదే దారిలో.. మొదల ఇన్‌పుట్ సబ్సిడీ కోసం తాను ఉద్యమిస్తే విమర్శించిన ప్రభుత్వం.. ఇప్పుడు సబ్సిడీ ప్రకటించిందని తెలిపారు. కేంద్ర కార్మిక మంత్రిగా ఉండగా పుర్రెబొమ్మను ముద్రించి.. కేసీఆర్ బీడీ కార్మికుల పొట్ట కొట్టారని విమర్శించారు. హైదరాబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోని ఎనమిది వేల ఎకరాలను 53 కంపెనీలకు వందల కోట్ల ముడుపులు తీసుకొని వైఎస్ పందేరం చేస్తుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.

దోచుకున్న లక్ష కోట్ల రూపాయలతో వైఎస్ కుటుంబం పేపర్‌ను, చానల్‌ను పెట్టిందని దుయ్యబట్టారు. అందులో నాలుగు పేజీలు తనను విమర్శించుకుంటూ కథనాలు రాస్తారని, మరో నాలుగు పేజీలు వారు చేయని పనులను చేసినట్లు రాసుకుంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ది మొండెద్దు ప్రభుత్వమని, మొండెద్దు నడవకపోతే ముల్లుకర్రతో పొడుస్తారని, అయినా నడవకుంటే దాన్ని వదిలించుకుంటారని, కాంగ్రెస్‌నూ అలాగే వదిలించుకోవాలని కోరారు.

మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకువస్తానని, ఎరువుల ధరలను తగ్గించి గ్యాస్ సిలెండర్లపై సబ్సిడీ ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే..గోదావరి జలాలను అన్ని గ్రామాలకు తరలించే ఫైల్‌పై సంతకం చేస్తానన్నారు. ఐఏఎస్‌కు ఒక పరీక్ష ఉండి, డీఎస్సీకి మాత్రం మూడు పరీక్షలు నిర్వహించడం సబబు కాదనీ, అధికారంలోకి వస్తే టెట్‌ను రద్దు చేసి ఎస్జీటీ అవకాశం కల్పిస్తానని భరోసా ఇచ్చారు.