December 11, 2012

ఆడపడుచులతో ఆత్మీయబంధం!

ఏ గ్రామానికి వెళ్లినా మహిళలు నన్ను తమ అన్నలా ఆదరిస్తున్నారు. ఊరి పొలిమేరల వరకు వచ్చి హారతులిచ్చి స్వాగతం పలుకుతున్నారు. చిట్యాల క్రాస్ వద్ద కొంతమంది మహిళలు పాద యాత్రలో నడిచారు. నాపై పాటకట్టి వాళ్లకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వాళ్ల అభివృద్ధికి ఎన్టీఆర్, నేనూ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. ఉన్నంతలోనే నన్ను బాగా చూసుకున్నారు. అదంతా చూసినప్పుడు పొల్లూ, తాలూ వారికి బాగానే తెలుసుననిపించింది. చిన్న మేలు చేసినా గుండెల్లో పెట్టుకొనే మనసును ఆ పాటల్లో చూడగలిగాను. అప్పుడూ ఇప్పుడూ మహిళలే మా బలం.

స్వాతంత్య్రం వచ్చిన తరువాతే ఏ ప్రభుత్వం చేయనంత మేలు వాళ్ల కోసం ఎన్టీఆర్ చేశారు. ఆడపిల్లకు ఆస్తిలో సగం హక్కును కల్పించడం అప్పట్లో సంచలనమే. మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు ఆడపడుచులపై ఆయనకున్న ప్రత్యే క అభిమానానికి నిదర్శనం. నేను వచ్చాక కాలేజీల్లో 33 శాతం కేటాయించాను. డ్వాక్రా సంఘాలు పెట్టి ఆత్మవిశ్వాసం పెంచాను. సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి ప్రోత్సహించాను. డ్వాక్రా వేదికగా పేదరిక నిర్మూలన కోసం వెలుగు పథకాన్ని ఇదే జిల్లా ఖానాపూర్‌లో ప్రారంభించాను. ఆ పాటలోని ప్రతి చరణమూ నన్ను అప్పటి జ్ఞాపకాల్లోకి నడించింది. వాళ్లలా గతాన్ని గుర్తుచేసుకుంటున్నారంటే.. వర్తమానంలో వాళ్ల బతుకు నరకప్రాయం కావడమే కారణమనిపిస్తోంది. వీళ్లొచ్చి పథకాల రూపుమార్చి నిలువునా మోసం చేశారు.

గ్యాస్ ధర తగ్గిస్తామని గాలి మాటలు చెప్పారు. పావలా వడ్డీ అని చెప్పి రెండు రూపాయల వడ్డీతో నడ్డి విరిశారు. మైక్రో ఫైనాన్స్ కోరలకు బలిచేశారు. ఆ రోజున వాళ్లలో ఆశలు రేపి వాటికి రెక్కలు తొడిగి గగనవీధుల్లోకి నడిచించిన వాడిగా.. వాళ్ల కష్టంలో భాగమూ నాదే. డ్వాక్రా అప్పుభారం తగ్గించడానికి అందుకే సూత్రప్రాయంగా సిద్ధమయ్యాను. కానీ, ఎలా? ఏమి చేస్తే వాళ్ల జీవితాల్లో పునర్వైభవం చూడగలను?..ఈ ఆలోచనలతోనే చిట్యాల గ్రామం దాటొచ్చాను.