December 11, 2012

అధికారంలోకి వచ్చాక రైతుల రుణాలు మాఫీ..

ఆదిలాబాద్ : టీడీపీ అధికారంలోకి వస్తే రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు ఆదిలాబాద్ జిల్లాలోని సిర్గాపూర్ క్రాస్ రోడ్డు నుంచి చిట్యాల క్రాస్‌రోడ్, తల్వెద క్రాస్‌రోడ్, మంజులాపూర్, నిర్మల్ పట్టణంలోని ఈద్గా చౌరస్తా, రూరల్ పోలీస్ స్టేషన్, మంచిర్యాల క్రాస్‌రోడ్, శాంతినగర్ చౌరస్తా, వెంకటాపూర్, అక్కాపూర్, మూక్తాపూర్ వరకు మంగళవారం 14.8 కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఎన్టీ రామారావు జిల్లాను ఆదర్శ జి ల్లాగా అభివృద్ధి చేసేందుకు కృషి చేశారని, నేను సైతం ఆయన బాటలోనే నడుస్తానన్నారు. జిల్లాను అన్ని రం గాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. జిల్లాలో అధికంగా ఉన్న గిరిజనుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేసిన ఘనత టీడీపీదేనన్నారు. ఇక్కడి గిరిజనుల అభివృద్ధికి మరింత కృషి చే స్తానని హామీ ఇచ్చారు. 500 జనాభా ఉన్న తండాలను, గూడేలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి, అభివృద్ది చేస్తానన్నారు.

సర్వం కోల్పోయి పునరావాసం ఏర్పర్చుకున్న ఎస్ఆర్ఎస్‌పీ ముంపు బాధితులకు నష్ట పరిహారం అందిజేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో పత్తి, పసుపు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయిందనీ, ఏ రైతును కదిలించిన క న్నీరు మున్నీరవుతున్నారని అన్నారు. రైతుల కష్టాలు తెలుసుకొని వారి కన్నీటిని తుడిచేందుకే తాను పాదయాత్ర చేపట్టాననీ అన్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు 174 మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారనీ, ఆ కుటుంబాలకు ఇప్పటి వరకు ఆర్థిక సహాయం అందించలేదన్నారు. రైతులను కాపాడతాననీ, వారు తీసుకున్న అన్ని రుణాలను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానని ఆయన అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షల 50 వేల మంది బీడీ కార్మికులు ఉన్నారనీ, బీడీ కార్మికులను ఆదుకుంటానన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు బీడీ కార్మికుల పొట్టకొట్టేందుకు బీడీ కట్టపై పుర్రెబొమ్మ గుర్తు పెట్టించారన్నారు. తాను ఢి ల్లీలో ఆందోళన చేస్తే పుర్రె గుర్తును తొలగించారని అన్నారు.

ఉత్తర తెలంగాణను ఎడారిగా మార్చే బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడ్డుకోలేదనీ, తాను అడ్డుకునేందుకు వెళ్లగా త నను మూడు రోజులు మహారాష్ట్ర జైలు లో పెట్టారని అన్నారు. జిల్లాలో రోడ్లన్ని అధ్వానంగా మారాయని, త మ హయాంలో నాలుగు లైన్ల రోడ్లను వేయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే తెలంగాణ పేరుతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి అవినీతితో జైలులో ఉన్న జగన్‌ను కలిశాడని, వైఎస్ఆర్ పార్టీలోకి పోతున్నాడని, ఇది నియోజక వర్గ ప్రజలు గమనించాలనీ చంద్రబాబు సూచించారు. వైఎస్ఆర్ పార్టీ ఏ నాటికైనా మళ్లీ కాం గ్రెస్‌లో కలిసి పోయేదేనన్నారు.

ఒక మంచి పని చేసేందుకు దేవాలయాలకు వెళ్తాం, కానీ మీ మాజీ ఎమ్మెల్యే మాత్రం జగన్‌ను కలువడంలో అంతర్యమేమి టో ఆలోచించాలని పరోక్షం గా ఇంద్రకరణ్‌రెడ్డి ఉద్దేశించి అన్నారు. సకలజనుల సమ్మెలో సింగరేణి కార్మికులు, విద్యార్థుల పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. టెట్ పరీక్షను రద్దు చేసి, బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించడంతో పాటు రెగ్యులర్‌గా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని బెల్టు షాపుల ఓనర్లను కాంగ్రెస్ పార్టీ ఆదర్శ రైతులుగా నియమించిందని, దాంతో ఒక ఎస్ఎంఎస్ కొడితే మ ద్యాన్ని ఇంటికి పంపిస్తున్నారనీ, దాంతో జిల్లాలో మద్యం ఫుల్, మంచినీరు నిల్ అన్నట్లు ఉందన్నారు. పోచంపాడ్ రైతులకు నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు.

తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశానని, తన రికార్డును ఎ వరూ చేరుకోరన్నారు. తాను పదవి కోసం పాదయాత్ర చేయడం లేదని, ప్రజల కష్టాలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు పాదయాత్ర చేస్తున్నానని ఆయన చెప్పారు. ఈ సమావేశాల్లో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎమ్మెల్యే నగేష్, టీడీపీ సీనియర్ నాయకులు పాయల శంకర్, లోలం శ్యామ్ సుందర్, బాబర్, యూనిస్ అక్బానీ, అందుగుల శ్రీనివాస్, జుట్టు అశోక్, రమాదేవి, కడెం మాజీ ఎంపీపీ రాజేశ్వర్‌గౌడ్, ఆదిలాబాద్ నియోజక వర్గం నాయకుడు గణేష్‌రెడ్డి, అల్లూరి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్రకు...జన నీరాజనం: ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ని యోజక వర్గంలో మంగళవారం పాదయాత్ర నిర్వహించిన చంద్రబాబునాయుడుకు జనం నీరాజనం పలికారు. పలు వివిధ గ్రామాల ప్రజలు డప్పు చప్పుళ్లతో, మేళ వాయిద్యాలతో, మం గళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడి పాదయాత్ర వస్తుందని తెలుసుకున్న పలు గ్రామాల ప్రజలు రెండు, మూడు కిలోమీటర్లు నడిచి పాదయాత్ర వెళ్ళే మె యిన్ రోడ్‌కు చేరుకొని స్వాగతం పలికారు.

అనంతరం తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను విన్నవించారు. టీడీపీ పాలనలోనే అభివృద్ధి పనులు జరిగాయనీ, ఇప్పటి వరకు కొత్త అభివృద్ధి పనులు చేపట్టకపోగా పాత అభివృద్ధి పనులకు మరమ్మత్తులు కూడా చేయడం లేదని తెలిపారు. సిర్గాపూర్ క్రాస్ రోడ్డు నుంచి చిట్యాల క్రాస్‌రోడ్, తల్వెద క్రాస్‌రోడ్, మంజులాపూర్, నిర్మల్ పట్టణంలోని ఈద్గా చౌరస్తా, రూరల్ పోలీస్ స్టేషన్, మంచిర్యాల క్రాస్‌రోడ్, శాంతినగర్ చౌరస్తా, వెంకటాపూర్, అక్కాపూర్, మూక్తాపూర్ వరకు పాదయాత్ర నిర్వహించిన చంద్రబాబునాయుడు ఆయా ప్రాంతాల్లోని పూరి గుడిసెల్లోకి వెళ్లి పేదలను పలకరించారు. రైతులను, కూలీలను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు. అలాగే ఆగిన బస్సుల్లోకి వెళ్లి ప్రయాణికులను పలకరించారు.