December 6, 2012

బాసరకు ఇవేం బాధలు!

చదువుల తల్లికి నిలయం ఈ బాసర. కాశ్మీర్ తరువాత దేశంలోనే సరస్వతి దేవాలయం ఉన్నది ఇక్కడే. గోదావరి ఒడ్డున ఉండటం కూడా ఒక విశిష్టత. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని అప్పట్లో దేవాలయాన్ని బాగా అభివృద్ధి చేశాను. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నా. ఈ పవిత్ర ప్రదేశాన్ని ఒక విద్యాకేంద్రంగా మలచాలని అప్పట్లోనే ఆలోచన చేశాను. అన్ని రకాల విద్యా సంస్థలను ఈ ప్రాంతానికి తీసుకురావాలని భావించాను. దానికి కొనసాగింపుగా గ్రామాన్నీ అభివృద్ధి చేయాలని అనుకున్నాను. కానీ, ఈరోజున అక్కడ పర్యటించినప్పుడు ఆ అభివృద్ధి గురుతులేవీ కనిపించలేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టున్న బాసర దుస్థితి బాధనిపించింది. ఇంత బాధలోనూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముచ్చటించడం ఊరట కలిగించింది.

అవినీతి విషయంలో వాళ్ల అవగాహన ముచ్చటేసింది. అవినీతికి తామూ బాధితులమేనంటూ వారు సొంత అనుభవాలను చెప్పుకొచ్చారు. " లంచం ఇవ్వడం తప్పని తెలిసినా తప్పడం లేదు సార్. చిన్న సర్టిఫికెట్ కావాలన్నా డబ్బు పెట్టాల్సి వస్తోంది. ఎమ్మార్వో నుంచి పంచాయతీ సర్పంచ్ దాకా.. లంచాలు ఆశించేవారే సార్. చాలాసార్లు ఎదురు తిరిగినా, గట్టిగా వాదించినా కొన్నిసార్లు మాకూ తప్పడం లేదు'' అంటూ ఓ విద్యార్థిని తల దించేసుకోవడం చూసినప్పుడు, లక్షల కోట్లు తిన్న బడాబాబులు, చోటాబాబులు తల ఎగరేసి తిరగడం, జైళ్ల దగ్గర, కోర్టుల దగ్గర చేతులు ఊపుతూ సిగ్గులేకుండా నవ్వులు చిందించడం గుర్తుకొచ్చింది.

వాళ్ల మాటలు విన్నప్పుడు అవినీతిపై పోరాటానికి అర్థమంతమైన ముగింపు ఇవ్వడం సాధ్యమేనన్న నమ్మకం నాకు కలిగింది. బాసరలో అడుగుపెట్టినప్పటి నుంచీ కనిపించిన దృశ్యాలే ఈ అత్యాధునిక సాంకేతిక విద్యా సంస్థలోనూ కనిపించడం విస్మయపరిచింది. ఐటీ ప్రాంగణంలో కొన్ని నీళ్ల ట్యాంకర్లు కనిపించాయి. వాటి గురించి ఆరా తీయగా, పంపులు, కుళాయిలు, పైపులైన్లు సరిగ్గా లేవని తెలిసింది. గోదావరి ఒడ్డున ఉన్నా విద్యార్థులకు ఇదేమి దుస్థితి!