December 6, 2012

జైల్లో ప్రత్యేక సౌకర్యాలెందుకు?

జగన్ సామాన్య ఖైదీయే కదా?
ఒక కోర్టు తీర్పుపై ఇంకో కోర్టులో అప్పీలా?
ఇలాగయితే అవినీతిపరులకు శిక్షలెలా పడతాయి
వైసీపీ నేత అవినీతిని కడేగేసిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
చంద్రబాబు సమక్షంలో ప్రశ్నల పరంపర
రాజకీయాల్లో అవకాశమిస్తే అవినీతి పనిపడతామని అభ్యర్థన
అంగీకరించిన టీడీపీ నేత.. 30% కోటా ఇస్తామని హామీ
ట్రిపుల్ ఐటీలో సమస్యలపై ఆవేదన
ఆదిలాబాద్‌లో పాదయాత్రకు శ్రీకారం
బాసర ఆలయంలో పూజలు

భైంసా, ఆదిలాబాద్, డిసెంబర్ 6 : "అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లిన ఎంపీ జగన్‌కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం ఎంతవరకు సమంజసం? ఆయనను సామాన్యఖైదీగా చూడాలి కదా''.. ఓ విద్యార్థి ప్రశ్న

"మనదేశంలో ఒక కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇంకో కోర్టుకు వెళుతున్నారు. ఇలాగయితే అవినీతిపరులకు శిక్షలు ఎలా పడతాయి?''మరో విద్యార్థి ఆవేదన

" అవినీతిని కడిగిపారేసేందుకు యువతకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇవ్వా లి'' ఇంకో విద్యార్థిని ఆకాంక్ష.. అవినీతిపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు బాసటగా నిలిచిన తీరిది. ఆదిలాబాద్ జిల్లాలో గురువారం పాదయాత్రకు శ్రీకారం చుట్టి బాసరకు వెళ్లిన చంద్రబాబు సమక్షంలో అవినీతి నేతలను ఉతికి ఆరేసిన వైనమిది..

అవినీతిపై పోరాటం కేంద్రంగా జరిగిన సంభాషణలో విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. సూటిగా ప్రశ్నలు దూశారు. అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు సలహాలు, సూచనలు అడుగుతూ వారిని చంద్రబాబు ఉత్సాహపరిచారు. జగన్ ప్రస్తావనను పలువురు విద్యార్థులు ఈ సందర్భంగా తీసుకొచ్చి ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. అందరిలా జగన్‌ను కూడా సామాన్య ఖైదీలా చూడాలి కదా అన్న విద్యార్థి వాదనతో చంద్రబాబు ఏకీభవించారు.

కోహినూరు వజ్రంలాంటి తమకు సానపెట్టేవారే కరువయ్యారని రాఘవేంద్ర అనే విద్యార్థి వాపోయారు. కసబ్ కోసం ప్రభుత్వం 60 కోట్లు ఖర్చు చేయడాన్ని దుర్గాప్రసాద్ అనే విద్యార్థి ప్రశ్నించగా, "చట్టాలు సరిగ్గా లేకపోవడమే సమస్య'' అని చంద్రబాబు సమాధానమిచ్చారు. అవినీతిపై పోరాటంలో భాగంగా యువతకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇవ్వాలని ప్రియాంక అనే విద్యార్థిని ఆకాంక్షను చంద్రబాబు స్వాగతించారు.

ఈసారి ఎన్నికల్లో యువతకు 30 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తెలంగాణపై అభిప్రాయం చెప్పాలని ఓ విద్యార్థి అడగ్గా, 2009కి ముందే కేంద్రానికి లేఖ ఇచ్చామని గుర్తుచేశారు. అంతకుముందు..చంద్రబాబుకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. " చంద్రబాబు జిందాబాద్'', "కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు'', "ఐటీ సీఎం చంద్రబాబు''అంటూ నినాదాలు చేశారు. ఆయనతో కరచాలనం చేసేందుకు విద్యార్థులు ముందుకు రావడంతో వారిని ఆపడం ఒక దశలో సెక్యూరిటీ సిబ్బందికి కష్టసాధ్యమైంది. అంతకుముందు..

బాసర నుంచి ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మార్గంలో ఉన్న పత్తి, కంది చేన్లలో పని చేస్తున్న రైతులను, కూలీలను పలకరించి, వారి సాధక, బాధలను వింటూ నేనున్నానంటూ వారికి ధైర్యం కల్పిస్తూ ట్రిపుల్ ఐటీ ప్రాంగణం వరకు పాదయాత్ర నిర్వహించారు. తన హయాంలో బాసరలో విద్య కోసం చేసిన దోహదాన్ని గుర్తు చేసుకున్నారు.

"బాసర అభివృద్ధికి నేను ఎనలేని కృషి చేశాను. ఇక్కడ ఐఐటీ ఏర్పాటు చేయాలని ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య కోరగా, తన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు అక్షరభ్యాసం కూడ ఇక్కడే జరిగింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని బాసరలో ఐఐటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాను. కానీ, తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్.. ఐఐటీని రంగారెడ్డి జిల్లాకు తరలించి, బాసరలో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయించారు'' అని వివరించారు. తానొచ్చిన తరువాతే రాష్ట్రంలో విద్యారంగం ముఖచిత్రం మారిపోయిందని గుర్తు చేశారు.

"నేను ముఖ్యమంత్రి కాక ముందు విద్యలో మన రాష్ట్రం వెనకబడి ఉంది. అప్పట్లో 30 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. నేను వచ్చాక కొత్తగా ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేయించాను'' అని చెప్పుకొచ్చారు. సీఎంగా ఉన్న కాలంలో సంవత్సరంలో ఆరు నెలలు ఇతర దేశాల్లో పర్యటించి అక్కడి టెక్నాలజీ అధ్యయనం చేసి, అక్కడి సాఫ్ట్‌వేర్ కంపెనీలతో మాట్లాడి రాష్ట్రంలో వాటి ఏర్పాటుకు కృషి చేశానని చెప్పుకొచ్చారు. దేశానికి ఢిల్లీ రాజధాని అయినా అభివృద్ధి మాత్రం హైదరాబాద్‌లో జరిగేలా కృషి చేశానని గుర్తుచేశారు.

మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల కోసం పని చేస్తాననీ, వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీది దుర్మార్గ ప్రభుత్వమనీ, కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరి ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. తాను ప్రభుత్వ భూములను కాపాడితే వైఎస్.. వాటిని పలు కంపెనీలకు అక్రమంగా అప్పగించారని ఆరోపించారు. ఆ భూములు తీసుకున్న వారిలో సగం మంది జైలు కెళ్లారని విమర్శించారు. వైఎస్.. తన కుమారుడికి లక్ష కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉండగా తాను నీతి, నిజాయతీ గీటురాయిగా వంద శాతం ఉద్యోగాలు అర్హులకే ఇచ్చానన్నారు.

గతంలో బీహార్ రాష్ట్రాన్ని బీమారి రాష్ట్రంగా వర్ణించేవారనీ, ప్రస్తుతం మన రాష్ట్రం ఆ స్థితికి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా,బాసర, మైలాపూర్, బిద్రెల్లి, టాక్లీక్రాస్‌ల మీదుగా జిల్లాలో తొలిరోజు యాత్ర కొనసాగింది. బాసరలోపూజలు చేసి నడక ప్రారంభించిన ఆయన 16 కిలోమీటర్లు నడిచారు. షెడ్యూల్ ప్రకారం ముథోల్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో రాత్రి బసచేయాల్సి ఉండగా, ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మాట్లాడుతూ ఆలస్యం కావడంతో అక్కడికి మూడు కిలోమీటర్ల ఇతవలే ఆయన యాత్రను ఆపివేయాల్చి వచ్చింది.