December 6, 2012

సంక్కరణలు.. బాగు కోరాలి!

సంస్కరణలు అవసరమే! అవి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఉండాలి. కానీ, దిగజార్చేలా ఉండకూడదు! సంస్కరణలు కొత్తగా ఉద్యోగాలు సృష్టించాలి. కానీ, ఉన్న ఉద్యోగుల పొట్టమీద కొట్టకూడదు! సంస్కరణలతో రైతులు పచ్చగా కళకళలాడాలి. కానీ, వారు ఆత్మహత్యలు చేసుకునేలా పురికొల్పకూడదు! సంస్కరణలతో వినియోగదారులకు తక్కువ ధరకే సరకులు దొరకాలి. కానీ, వారి జేబుకు మరింత చిల్లు పడేలా ఉండరాదు! వెరసి.. సంస్కరణలతో పేదలు లక్షాధికారులు కాకపోయినా.. కనీసం మధ్యతరగతికైనా ఎదగాలి! కానీ, నిరుపేదలు కారాదు! ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులు, చిన్న వ్యాపారులు, వినియోగదారుల పాలిట శాపమే!

ఈరోజు నిజామాబాద్ జిల్లా పిట్లం, బాన్స్‌వాడ తదితర పట్టణాల్లో పాదయాత్ర చేశా. పాదయాత్రలో రోడ్డుకు ఇరువైపులా వందల సంఖ్యలో చిల్లర దుకాణాలు కనిపించాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇలాంటి కొన్ని కోట్ల చిల్లర దుకాణాలకు శాపమే. కేవలం తన స్వార్థం కోసం 4 కోట్ల దుకాణాలు కనుమరుగయ్యే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోంది. 15-20 కోట్లమంది జీవనోపాధి పోయే పరిస్థితి కనిపిస్తోంది. రైతులకు మేలు జరుగుతుందని, వినియోగదారులకు తక్కువ ధరకే సరకులు దొరుకుతాయని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.

కానీ, మా పార్టీ ఎఫ్‌డీఐలకు వ్యతిరేకం. వీటివల్ల మన వ్యాపారం విదేశీ హస్తగతమవుతుంది. తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. అన్ని పార్టీలూ వ్యతిరేకించినా కేంద్రం ఎందుకు ముందుకు వెళుతోందో అర్థం కాదు. దేశ ప్రయోజనాలనే పణంగా పెడుతోంది. దుకాణ యజమానుల్లో అర్థం కాని ఆందోళన. పెనుముప్పు ఏదో పిడుగుపాటులా తమను తాకనుందన్న భయం వ్యక్తమవుతోంది. వాళ్లలో ధైర్యం నింపడానికి నాలుగు మాటలు చెప్పడం తప్ప.. కేంద్రం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయానికి ఇంకెలా నిరసన తెలపగలం!?