December 6, 2012

మారిన బాబు.. ప్రజలకు జవాబు

ప్రత్యర్థులపై ఎదురుదాడి.. హామీల జడి
అనారోగ్యాన్ని అధిగమించి 116 కి.మీ. యాత్ర

నిజామాబాద్, డిసెంబర్ 5 : తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా కూడా అదే వ్యవహారశైలితో ఉండేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. జనంతో మమేకమై కొత్త హావభావాలను పలికిస్తున్నారు. నవ్వుతూ వా రి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారడిగే ప్రశ్నలకు జవాబులు చెబుతూ.. సమస్యలు వింటూ తమ పార్టీ విధానాలను వారికి అర్థమయ్యే రీతిలో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అనారోగ్యంతో అష్టకష్టాలు పడినా.. పట్టువదలని విక్రమార్కుడిలా తన 'వస్తున్నా.. మీకోసం' యాత్రను విజయవంతంగా కొనసాగించారు.

నిజామాబాద్ జిల్లాలో 8రోజుల పాటు మొత్తం 116 కిలోమీటర్ల మేర నడిచారు. జిల్లాలోని సాలంపాడ్ వద్ద చంద్రబాబు యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఇక్కడ ఉత్సవాలను ఘనం గా నిర్వహించారు. పెంటాఖుర్దులో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లాతో కలిపి బాబు పాదయాత్ర 1038 కిలోమీటర్లు పూర్తయింది. విద్యార్థులు, యువకులు, వృద్ధులు, రైతులు, మైనారిటీలు, డ్వాక్రా మహిళలు, వివిధ వృత్తుల వారిని, కూలీలను ప్రత్యక్షంగా కలుసుకుని, వారి బాధలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.

పాదాలు బొబ్బలెక్కి.. మోకాళ్ల నొప్పులొచ్చి.. చక్కెర శాతం పెరిగి.. ఎన్నో అవస్థలు పడ్డారు. అయినా వెనకడుగు వేయక పార్టీ శ్రేణులకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు కదిలారు. ప్రత్యర్థులపై ఎదురుదాడి చేయడం ద్వారా పార్టీ శ్రేణులకు కొండంత ధైర్యాన్నిచ్చారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు వైసీపీ, కాంగ్రెస్‌లపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ డిక్లరేషన్‌లను ప్రజలకు వివరించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరితో పాటు తనయుడు లోకేష్ కూడా వెయ్యి కిలోమీటర్ల సంబరాల్లో పాల్గొన్నారు