December 24, 2012

మాఫియాతో శాసించాడు! ప్రజలను కొట్టి లక్షల ఎకరాలు దోచి పెట్టాడు



వైఎస్ పాలనపై చంద్రబాబు ధ్వజం

సహకార ఎన్నికల్లో అధికార దౌర్జన్యం

అడ్డుపడిన మా పార్టీ నేతలపై లాఠీచార్జి

పోలీసులూ.. మీకూ ఆ ఐఏఎస్‌లు, మంత్రుల గతే!

మేమూ దాడులు చేస్తే కాంగ్రెస్సే మిగలదు

వైఎస్ హయాంలో 117 సెజ్‌ల పేరిట 2.75 లక్షల ఎకరాలను ప్రజల నుంచి లాక్కొని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని, ఒక్క హైదరాబాద్‌లోనే 8వేల ఎకరాలను ధారాదత్తం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రం గా ఆక్షేపించారు. కరీంనగర్ జిల్లా నర్సయ్యపల్లె నుంచి సోమవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. మొత్తం 14.5 కిలోమీటర్లు నడిచారు. రాష్ట్రంలో మాఫియాలను తయారు చేసి ప్రైవేటు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని విమర్శించారు. తన హయాంలో ఐటీ కంపెనీలకు ఒక ఎకరా ఇస్తే వేయి ఉద్యోగాలు కల్పించాలని షరతు పెట్టామని, లక్షల ఎకరాలను ప్రైవేటు వారికి కట్టబెట్టినా ఇప్పుడు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని విమర్శించారు.

ఏపీఐఐసీని పావుగా చేసుకుని అధికార పార్టీ నేతలు నోటీసులు ఇచ్చి రైతుల భూములను లాక్కున్నారని, ఒక వాన్‌పిక్ కంపెనీకే 19 వేల ఎకరాలు ఇచ్చారని ఆరోపించారు. కలెక్టర్లతో కాకుండా ప్రైవేటు వ్యక్తులతో భూసేకరణ చేయించి రైతులకు ఎకరాకు రూ.లక్ష ఇచ్చి, ఎకరా రూ.2-3 కోట్లకు అమ్ముకునేందుకు రంగం సిద్ధం చేశార న్నారు. ప్రజల నుంచి రూ.20 వేల కోట్ల ఆస్తులు లాక్కొని రెండుమూడు వందల కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. చివరకు అసైన్డ్ భూములను కూడా స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు.

పేదలకు వంద గజాల స్థలం ఇవ్వలేకపోగా ఒక్కరికే 20 వేల ఎకరాలు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎవడ బ్బ సొమ్మని ఎడాపెడా భూపందేరం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వస్తే డీకేటీ అసైన్‌మెంట్ పట్టాలను శాశ్వత పట్టాలుగా చేసి అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. అవినీతిపరులను ప్రొత్సహించే సీఎం అవసరమా? అని సుల్తానాబాద్ సభలో ప్రజలను ఆయన ప్రశ్నించారు. సహకార ఎన్నికలు ప్రకటించిన ప్రభుత్వం... కాంగ్రెస్ వారికే సభ్యత్వ పుస్తకాలు ఇచ్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.

తప్పుడు రికార్డులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో సభ్యత్వ పుస్తకాలున్నట్లు తెలిసి, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ అక్కడకు వె ళితే పోలీసులు దౌర్జన్యం చేశారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పారని అనుకూలంగా వ్యవహరించిన అధికారులు జైలుకు పోయారని, అలా చేసిన మం త్రి కూడా జైలులోనే ఉన్నారని అన్నారు. " మీరు కూడా అదే చేస్తే జైలు తప్పద''ని పోలీసులను హెచ్చరించారు.

కాగా, కరీంనగర్‌జిల్లాలో ఒక చేతకాని మంత్రి మంథనిలో తమ నేత నాగయ్య ఇంటిపై దాడులు చేయించార ని, ఎస్‌పీకి ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. తమ కార్యకర్తలు తిరిగి దాడి చేస్తే మంత్రి జిల్లాలో తిరగలేరని హెచ్చరించారు. తామూ అలా చేస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఉండడని హెచ్చరించారు. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అరాచకం పెరిగిపోతున్నదని ఢిల్లీలో అత్యాచారం ఘటనను గుర్తుచేశారు. కేంద్రం లో, రాష్ట్రంలో అధికారంలో ఉండి, తెలంగాణ ఇచ్చే శక్తి ఉన్నా మళ్ళీమళ్ళీ అభిప్రాయం కోరడం టీడీపీని రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నంలో భాగమే'నని ఆరోపించారు.

హన్మకొండ: పత్తి రైతుల సమస్యలపై వచ్చేనెల మొదటి వారం లో వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో చంద్రబాబు ఒక రోజు దీక్ష చేపడతారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి సోమవారం మీడియాకు ఈ విషయం తెలిపారు.