December 24, 2012

జగన్ నేల మాళిగలు శోధించాలి: యనమల

  అక్రమాస్తుల వెలికితీతకు వైఎస్ జగన్‌కు చెందిన భవనాల్లో నేల మాళిగలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శోధించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. 'జగన్ వద్ద రూ. లక్ష కోట్ల డబ్బు ఉందని అందరూ అనుకొంటున్నారు. వాటిని బెంగుళూరు, హైదరాబాద్, పులివెందుల, ఇడుపులపాయ తదితరచోట్ల నిర్మించిన భవనాల నేళ మాళిగల్లో దాచి ఉంచారని ప్రచారం జరుగుతోంది.

సిబిఐ, ఇడి, కేంద్ర విజిలెన్స్ సంస్ధలు ఇంతవరకూ ఆ ప్రాంతాలకు వెళ్ళి తనిఖీలు చేయలేదు. దీనిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ తనిఖీలు జరగకుండా తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌ల మధ్య అవగాహన కుదిరిందనే అనుకోవాల్సి వస్తోంది' అని ఆయన అన్నారు. జగన్ అవినీతిని పూర్తి స్ధాయిలో నిర్దారించడానికి పై మూడు సంస్ధలు ప్రత్యేక తనిఖీ బృందాలను పెట్టి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ భవనాల నేల మాళిగల్లో తనిఖీలు నిర్వహించాలని, తమ నేత కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని చెప్పే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు దీనికి పూర్తి స్ధాయిలో సహకరించాలని ఆయన కోరారు.

ఈ సంస్ధలు దీనికి స్పందించకపోతే టిడిపి తరపున తాము హైకోర్టు, సుప్రీం కోర్టుల దృష్టికి ఈ అంశాలు తీసుకువస్తామని, కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని కోరతామని ఆయన పేర్కొన్నారు.