November 18, 2012

మీరూ కష్టపడండి...........(ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో Sun, 18 Nov 2012)


  • ఎన్నికలు రాబోతున్నాయి
  • త్వరలో అభ్యర్థుల వెల్లడి
  • టిడిపి విస్తృత సమావేశంలో బాబు
ముందస్తు ఎన్నికలకు పార్టీ శ్రేణులను టిడిపి సిద్ధం చేస్తోంది. లోక్‌సభకు, అసెంబ్లీకి త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తానని చంద్రబాబు వెల్లడించారు. ప్రజల కోసం కష్టపడి పనిచేసే వారికే పదవులిస్తానని కరాఖండిగా చెప్పారు. ఇప్పటికే బిసి, మైనార్టీ డిక్లరేషన్లు ప్రకటించి, ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చింది. తాజాగా మహిళ, యువత, ఉద్యోగ, కార్మిక డిక్లరేషన్లు ప్రకటిస్తానని చంద్రబాబు ఎన్నికల వరాలు కురిపించారు. టన్నులకొద్దీ అవినీతి సొమ్ముతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రాంతీయ సెంటిమెంట్‌తో టిఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం వీర్లపల్లి గ్రామంలో పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరిగింది. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కింజారపు ఎర్రన్నాయుడు మృతికి సమావేశం సంతాపం తెలిపింది. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను నేతలు కొనియాడారు. నీలం తుపాను మృతులకూ నివాళులర్పించారు. 'వస్తున్నా... మీ కోసం పాదయాత్ర ద్వారా ప్రజల్లో తిరుగుతున్నాను, మీరూ కష్టపడాలి' అని నాయకులకు చంద్రబాబు ఉద్బోధించారు. అయితే నాయకుల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జీలుగా నియమించింది ఎన్నికల్లో పోటీ చేయడానికే కాదని, ప్రజా సమస్యలపై పోరాడటానికి కూడా అని అన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షులకు ఎలాంటి కార్యచరణా లేదని, వెంటనే కార్యచరణను సిద్ధం చేసుకుని కార్యరంగంలోకి దూకాలని సూచించారు. పని చేయని ఇన్‌ఛార్జీల స్థానంలో మరొక అభ్యర్థిని పెడితే తాను గెలుస్తానంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. దేశ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఎన్నికలెప్పుడొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. ఏ క్షణంలో ఎన్నికలొచ్చినా నాయకులూ, కార్యకర్తలూ సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జీలకు అజాగ్రత్త పనికిరాదని హెచ్చరించారు. అంతా అనుభవించి పార్టీ కోసం పని చేయకపోవడం సరైంది కాదన్నారు. పార్టీకి వస్తున్న కష్టనష్టాలను సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను ఒకటికి రెండుసార్లు పరిశీలించి ప్రకటిస్తానని నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను పరోక్షంగా హెచ్చరించారు. టిడిపిపై ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలకు ధీటైన జవాబివ్వడంలో వెనుకబడుతున్నామని చురకలంటించారు. విమర్శలకు తగిన సమాధానం చెప్పకపోతే టిడిపియే తప్పు చేసిందనే భావన ప్రజల్లోకి వెళ్తుందన్నారు. ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కోకతప్పదని చెప్పారు. 'పాదయాత్ర సందర్భంగా వెన్నుపూస ఇబ్బందిపెట్టింది. కాళ్ళకు బొబ్బలొచ్చాయి. విపరీతంగా నొప్పి వచ్చింది. డాక్డర్లు, నాయకులు విశ్రాంతి తీసుకోవాలన్నారు. అయినా నేను దీక్షగా పాదయాత్ర కొనసాగిస్తున్నాను తప్ప ఎవరికీ చెప్పుకోలేదు. డాక్డర్ల సలహా మేరకు మట్టిరోడ్డుపై నడక సాగిస్తున్నాను' అని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకానికి తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వాస్పత్రుల్లో వసతులపై ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పారు.
కష్టపడకపోతే రాక్షస పాలన నుంచి విముక్తి చేయలేం
చారిత్రాత్మక రోజు కోసం అందరూ కష్టపడాలని నాయకులకు చంద్రబాబునాయుడు సూచించారు. లేకపోతే రాక్షస కాంగ్రెస్‌ పాలన నుంచి ప్రజలను విముక్తి చేయలేమన్నారు. టన్నులకొద్దీ అవినీతి సొమ్ముతో ప్యాకేజీలు నిర్ణయించి ఎమ్మెల్యేలను కొంటున్నారని జగన్‌పై ధ్వజమెత్తారు. టిడిపి ఎంపీ, ఎమ్మెల్యేలను కొన్న నీచమైన చరిత్ర కాంగ్రెస్‌కుందని ఉదహరించారు. 2009 నుంచి పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కుల, మతాలతో నీచమైన రాజకీయాలు చేస్తున్నారని జగన్‌పై విరుచుకుపడ్డారు. 2014 మేలో ఎన్నికలు రావాల్సి ఉండగా ముందుస్తు, మధ్యంతరమంటూ కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోందని, అందుకు మనమూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌లు అధికారపార్టీని కాకుండా ప్రతిపక్ష పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. తెలంగాణాలోని ఏ సమస్యపై స్వతంత్రంగా పోరాటం చేశారో టిఆర్‌ఎస్‌ నేతలు చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు. అవినీతికి పాల్పడి జైల్లో ఉన్న జగన్‌పై ఎందుకు మాట్లాడడం లేదని టిఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించారు. ఆర్నెల్లు ఫామ్‌హౌస్‌లో పడుకుని మాటల గారడీతో ప్రజలను మాయచేయలేవని పరోక్షంగా కెసిఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. అవినీతి మంత్రులందరీపైనా విచారణ జరిపితే కేబినెట్‌లో సగంమందికి పైగా జైల్లో ఉంటారని చెప్పారు. అవినీతి మంత్రులను సిఎం వెనుకేసుకొస్తున్నారని, మరోపక్క ఆయన శిష్యులే ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్నారని విమర్శించారు.
No comments :

No comments :