November 18, 2012

ఆ రోజు పొరపాటు చేస్తే.. అగ్నిగుండంలోకే

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను బంగాళాఖాతంలో పడేయండి
కిరికిరి రెడ్డిగా మారుతున్న సీఎం కిరణ్
జైల్లో నుంచి పిల్ల కాంగ్రెస్ నేత రాజకీయం
అక్కడి నుంచే ఎమ్మెల్యేలను కొంటున్నారు
కాంగ్రెస్ దొంగలు 9 లక్షల కోట్లు దోచుకున్నారు
ఎన్నికల ఒక్క రోజు నాకు కేటాయించండి
ఆ రోజు పొరపాటు చేస్తే.. అగ్నిగుండంలోకే
మెదక్ జిల్లా పాదయాత్రలో చంద్రబాబు

సంగారెడ్డి, నవంబర్ 18 : ప్రజాసమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను కూకటి వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పడేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన చేపట్టిన 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్ర ఆదివారం మధ్యాహ్నం మెదక్ జిల్లాలోకి చేరుకుంది. జిల్లా సరిహద్దులోని భానూర్ గ్రామానికి చేరుకున్న ఆయన.. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ దొంగలు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలను దోచుకున్నారన్నారు. రాష్ట్రంలో 2004లో రూ. 25 వేల కోట్ల బడ్జెట్ ఉండగా ఇప్పుడు లక్షా 50 వేల కోట్లకు పెరిగిందని, కానీ పేదవాడి ఆరోగ్యం ఏ మాత్రం బాగుపడలేదన్నారు.

ఈ డబ్బంతా కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకే పోయిందన్నారు. ప్రభుత్వ భూములను, ఖనిజ సంపదను అమ్ముకుని, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చేసి మనం కట్టిన పన్నులను పందికొక్కుల్లా మింగేశారన్నారు. దోచుకున్నంత దోచుకుని రాష్ట్రాన్ని అడవి పందుల్లా నాశనం చేశారన్నారు. కాంగ్రెస్ నాయకుల అవినీతి వల్లే రాష్ట్రంలో కరెంట్ లేదని, ఉద్యోగాలు లేవని, రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు దోచుకుని తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌గా విడిపోయారన్నారు.

అవినీతికి పాల్పడి జైల్లో ఉన్న పిల్ల కాంగ్రెస్ నేత అక్కడినుంచి రాజకీయం చేస్తూ ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. తమపై ఉన్న కేసులను మాఫీ చేస్తే కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు రాయబారాలు నెరపుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరిరెడ్డిగా మారారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని తాను ప్రకటిస్తే ఎలా చేస్తావో చెప్పాలంటూ ఆయన కిరికిరి పెడుతున్నారన్నారు. అయితే, తాను వారికి సమాధానం చెప్పనని.. ఎలా మాఫీ చేస్తానో అధికారంలోకి వచ్చాక చేసి చూపిస్తానన్నారు.

ఒక్క రోజు నాకు కేటాయించండి
ఎన్నికలు జరిగే ఒక్కరోజు తన కోసం కేటాయించాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవినీతి నిర్మూలనకు ధర్మాన్ని, విలువలను కాపాడటమే తన ధ్యేయమన్నారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయకుండా నిజాయితీగా ఉంటున్నానన్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులందరి ఆస్తుల వివరాలు ప్రకటించే నాయకుడిని దేశంలో తానొక్కడినేనని ఆయన అన్నారు. డబ్బులకు కక్కుర్తి పడి తమ పార్టీ నుంచి వైసీపీలో చేరినవారు.. 2009లో తమ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఒక ఎమ్మెల్యే, ఒక నాయకుడు డబ్బులకు అమ్ముడుపోతే 50 మందిని తయారు చేసుకునే శక్తి టీడీపీకి ఉందన్నారు. డబ్బుతో కంపు కొడుతున్న రాజకీయాలను ప్రక్షాళన చేసి విలువలు పెంపొందించాలనుకుంటున్నానన్నారు. అందుకే ఎన్నికలు జరిగే ఒక్కరోజు తనకు కేటాయించి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఆ ఒక్క రోజు డబ్బులకు, దేనికీ లొంగిపోవద్దని ప్రజలను కోరారు.

ఏ మాత్రం పొరపాటు చేసినా ప్రస్తుతమున్న సమస్యల సుడిలో నుంచి అగ్నిగుండంలో పడతారని, మిమ్మల్ని కాపాడేవారెవరూ ఉండరన్నారు. పత్తిని వారం రోజుల్లో కొనుగోలు చేయకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే గిట్టుబాటు ధర ఇచ్చి పత్తిని కొనకపోతే ఖబడ్దార్ అంటూ ఆయన ముఖ్యమంత్రిని హెచ్చరించారు.

టీడీపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కుట్ర
తెలంగాణ ఇవ్వాలని తాను చెబితే ఆంధ్రాలో టీడీపీని బలహీనపర్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని చంద్రబాబు అన్నారు. అయితే, తెలంగాణను తానేనాడూ వ్యతిరేకించలేదని, వ్యతిరేకంగా మాట్లాడలేదని, భవిష్యత్తులో కూడా వ్యతిరేకించబోనని స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది తామేనని ఆయన తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న నాయకులు గతంలో టీడీపీలోనే ఉన్నవారేనన్నారు.

మంత్రి పదవి ఇవ్వలేదని పార్టీపెట్టి తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారని కేసీఆర్‌నుద్దేశించి విమర్శించారు. ఉద్యమం పేరిట రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ ఆరు నెలలు పడుకుంటారని, ఆరు నెలలు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను బంగాళాఖాతంలో పడేయాలని చంద్రబాబు కోరారు.

ప్రజలు కష్టాల్లో ఉన్నారు: లోకేష్
రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. ముఖ్యంగా కరెంట్ కష్టాలతో సతమతమవుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. పాదయాత్రకు వచ్చినవారంతా తమ సమస్యలను చెబుతుంటే బాధ కలుగుతోందన్నారు. పాదయాత్రలో పాల్గొన్న లోకేష్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే ఆయన తనను కలిసిన కొందరితో పిచ్చాపాటిగా మాట్లాడుతూ కరెంట్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దీనిపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

చెట్టు కింద భోజనం
చంద్రబాబుతో పాటు పాదయాత్ర చేసిన భువనేశ్వరి ఆదివారం మధ్యాహ్నం బీడీఎల్ సమీపంలో చెట్టుకిందే వనభోజనం చేశారు. సోదరి ఉమామహేశ్వరి, వదిన జయశ్రీ, ఇతర మహిళలతో కలిసి ఆమె చెట్టు కింద కుర్చొని భోజనం చేశారు. రంగారెడి ్డజిల్లా మహిళలు ఆమెకు బొట్టుపెట్టి శాలువా కప్పి చీరపెట్టారు.
No comments :

No comments :