November 18, 2012

పాదయాత్రలో బాబు కొత్త ఒరవడి,అవినీతిపై యువగళం



అవినీతిపై యువగళం
పాదయాత్రలో బాబు కొత్త ఒరవడి
సమస్యలు ఏకరువు పెట్టిన యువత
ఇంజనీర్లమైనా 300 కూలీకి పనిచేస్తున్నాం

రంగారెడ్డి జిల్లా, నవంబర్ 17 : ప్రజాసమస్యలు తెలుసుకోడానికి ప్రారంభించిన పాదయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తన పాదయాత్రను చర్చావేదికగా మార్చారు. రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతిపై రాత్రి 9 గంటల తర్వాత రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో బహిరంగ చర్చ నిర్వహించారు.

గజగజలాడే చలిలో నిర్వహించిన ఈ చర్చకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర రాజధాని నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోని ఓ చిన్న పల్లెలో నిర్వహించిన ఈ చర్చా వేదిక ప్రజా చైతన్యానికి కరదీపికలా కనిపించింది. సమస్యలపై తమకున్న అవగాహనను యువతీ యువకులు కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. ప్రజల దుస్థితికి, ఈ అవినీతికి కారణం కాంగ్రెస్, వైఎస్సేనని గళమెత్తారు. చర్చ ఇలా సాగింది..

శ్రీనాథ్‌గౌడ్: వైఎస్ కుటుంబం కొడుకు, కూతురు, తల్లి తేడా లేకుండా దోచుకున్నారు. అవినీతి డబ్బుతో సాక్షి పేపర్, టీవీ పెట్టారు. ఇప్పుడు రోజుకో ఎమ్మెల్యేని కొంటున్నారు. ఎన్నికల్లో ప్రజలను కొనాలనుకుంటున్నారు. వారి సంగతి మేము చూసుకుంటాం. యువకులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఎదగాలి.

మరో యువకుడు: మీరుండగా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. దేశంలోనే మనం ముందుండేవాళ్లం. ఒకప్పుడు గుజరాత్ కంటే ముందున్న మనం కాంగ్రెస్ తొమ్మిదేళ్ల పాలన వల్ల 20 - 30 ఏళ్లు వెనక్కి పోయాం. టీడీపీ అధికారంలోకి వచ్చిననాడే అసలైన దీపావళి.

మరో యువకుడు: సార్ నేను పెన్నార్ కంపెనీలో పనిచేస్తున్నా. రెండు గంటలు కరెంట్ ఉంటే 8 గంటలు జనరేటర్ మీద పనిచేస్తున్నాం. గతంలో నెలకు నాలుగు లక్షల కరెంట్ బిల్లు అయ్యేది.. ఇపుడు నెలకు రూ.40లక్షలు జనరేటర్ ఖర్చవుతోంది.

చంద్రబాబు: దీనికి ఎవరు కారణం తమ్ముళ్లూ..?

జనం: వైఎస్, కాంగ్రెస్సే

ఓ ఇంజనీర్: నేను ఇంజనీర్‌ను. కరెంట్ కష్టాల వల్ల ఇంజనీర్లు, పాలిటెక్నిక్, ఐటీఐ వాళ్లు, కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇంజనీరింగ్ చదువుకున్నా లేబర్‌తో పాటే రోజు వారీ రూ. 300 కూలీకే పనిచేస్తున్నాం.

శ్రీకాంత్‌రెడ్డి: సార్ మాకు ఇల్లు లేదు. ఏ ఆఫీసుకు వెళ్లినా మీరు రెడ్డిలు ఇల్లు ఎలా వస్తుంది? ఐదువేలు లంచం ఇస్తే ఇల్లు మంజూరు చేస్తామంటున్నారు. కరెంట్ ఫ్యూజు పోతే బీరు, బిర్యానీ తినిపిస్తేనే వేస్తున్నారు. సింగాపూర్‌లో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణంలో మీ భూములు పోతున్నాయని కాంగ్రెస్‌వాళ్లు భయపెట్టి వాటిని ల్యాంకో రాజగోపాల్‌కు లక్ష, రెండు లక్షలకు అమ్మించారు. తీరా ఈ భూములు కొనుగోలు చేసి వీటి పక్కనుంచి రోడ్డు వేశారు. ఇపుడు వీటి ధర రూ. 30లక్షలు. మోసం చేసి భూములు కొల్లగొట్టారు.

రాము: నేను ఎంఏ చదువుకుంటున్నా.. ఏ ఉద్యోగానికి వెళ్లినా లంచం అడుగుతున్నారు. ఇచ్చే స్థోమత లేక మా నాన్నకు సాయంగా వ్యవసాయం చేస్తున్నా.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ప్రజలందరి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అవినీతిపై గ్రామాలకు వెళ్లి ప్రజలకు వివరించాలని చెప్పారు.

No comments :

No comments :