November 2, 2012

ప్రజలలో మమేకమైన వ్యక్తి, పదవులకు వన్నె తెచ్చారు,ఒక మంచి నాయకుడు, సహచరున్ని కోల్పోయా చంద్రబాబు ఆవేదన

ఎర్రం నాయుడు ప్రజా నాయకుడు
ప్రజలలో మమేకమైన వ్యక్తి, పదవులకు వన్నె తెచ్చారు
ఆయన మృతి టీడీపీకి తీరని లోటు

 తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు మరణ వార్తను జీర్ణించుకోలేక పోతున్నానని, ఆయన ప్రజా నాయకుడని, ప్రజలతో మమేకమయ్యేవారని, కుటుంబంతో కంటే ఎక్కువగా ప్రజలతోనే గడిపేవారని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆయన ఏ పదవి చేపట్టినా ఆ పదవులకు వన్నె తెచ్చేవారని బాబు కొనియాడారు.

ఎర్రం నాయుడు మరణ వార్త తెలియగానే తన పాదయాత్రను వాయిదా వేసుకుని చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిదేవి, కుమారుడు లోకేష్ నాయుడుతో కలిసి హుటాహుటిన శుక్రవారం మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా, నిమ్మాడ చేరుకున్నారు. ఎర్రం నాయుడు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక మంచి నాయకుడిణ్ణి కోల్పాయని అన్నారు.

ఎర్రంనాయుడు మృతి పార్టీకి తీరని లోటని, ఒక మంచి నాయకుడు, ఆప్తుడు, సహచరున్ని కోల్పోయామని చంద్రబాబు ఆవేదనంతో తెలిపారు. పార్టీలో ఏదైన కీలక బాధ్యత ఎవరికి అప్పగించాలని ఆలోచన వచ్చినప్పుడు ఎర్రం నాయుడే గుర్తుకు వచ్చేవారని, ఆ పని ఆయనకు అప్పజెప్పితే చిత్తశుద్ధితో పనిచేసేవారని చంద్రబాబు అన్నారు. గంటలో తిరిగి వస్తాను అని కుటుంబ సభ్యులతో చెప్పి వెళ్లిన ఆయన అనంత లోకాలకు వెళ్లిపోయారని కన్నీరుమున్నిరయ్యారు. రేపు అంత్యక్రియలు ఉన్నందున ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు బాబు తెలిపారు. ఆదివారం నుంచి పాదయాత్ర మళ్లీ ప్రారంభిస్తానని చెప్పారు..

No comments :

No comments :