November 24, 2012

జగన్ దోచుకున్న డబ్బు రికవరీ చేస్తే, మూడుసార్లు రుణ మాఫీ చేయవచ్చు

ఎవరు విమర్శించినా రుణమాఫీ చేసి తీరుతాం
జగన్ దోచుకున్న డబ్బు రికవరీ చేస్తే,
మూడుసార్లు రుణ మాఫీ చేయవచ్చు
విత్తనాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం : చంద్రబాబు

మెదక్, నవంబర్ 24 : ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణ మాఫీపైనే చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రుణ మాఫీ ఎలా చేస్తారో చెప్పాలని వైఎస్పార్‌సీపీ నేత విజయమ్మ ప్రశ్నించారని, రుణ మాఫీ ఎలా చేస్తానో చేసిచూపిస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడు 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర 50 రోజుకు, మెదక్ జిల్లాలో ఏడవ రోజు కొనసాగుతోంది. శనివారం ఉదయం జిల్లాలోని న్యాల్‌కల్ నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. ఇబ్రహీంపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆయన దోచుకున్న సోమ్ము రికవరి చేస్తే రాష్ట్రంలోని రైతుల రుణాలను మూడు సార్లు మాఫీ చేయవచ్చునని అన్నారు.

రాష్ట్రంలోని రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం తీరును దుయ్యబట్టారు. తెలుగుదేశం హయాంలో గ్రామసభల ద్వారా అనేక సమస్యలు పరిష్కరించామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులు తీసుకున్న రుణాలన్నీ మాపీ చేస్తామని మరోమారు ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు మొత్తం 16 కిలోమీటర్ల మేర బాబు పాదయాత్ర సాగనుంది.
No comments :

No comments :