November 24, 2012

రైతు బాగుండొద్దా..?: చంద్రబాబు

రైతు బాగుండొద్దా..?: చంద్రబాబు

టీడీపీ హయాంలో వరుణుడు శీతకన్నేయడం వల్ల వర్షానికి కరువొచ్చింది. కానీ.. ఎన్నడూ ఎరువుకు కరువు లేదు. పురుగు మందులకు కరువు లేదు. విత్తనాలకు కరువు లేదు. విద్యుత్తుకూ కరువు లేదు. ఇప్పట్లా చుక్కల్లో కాకుండా వాటి ధరలూ నేలమీదే ఉండేవి. పంట ఉత్పత్తుల మద్దతు ధరకూ కరువు ఉండేది కాదు! కానీ, ఇప్పుడు ఇదేం దౌర్భాగ్యం!? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని చందంగా.. విత్తనాల ధర పెంచేశారు. ఎరువులు, పురుగు మందుల ధరలను చుక్కల్లో కలిపేశారు.

విద్యుత్తు మాటే లేదు. అయినా, అసలు, కొసరు అంటూ చార్జీలతో బాదేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకూ మద్దతు ధర లేదు. ఈ ప్రభుత్వ విధానాల కారణంగానే రైతులు అప్పుల పాలయ్యారు. ఫలితంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారాన్ని చలాయించడమే కాదు.. బాధ్యతనూ తీసుకోవాలి. వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. ప్రభుత్వం తనకు ఉన్న విస్తృత అధికారాలను రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఉపయోగించాలి. కానీ, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. రైతుల దుస్థితిని చూసే వారి రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ ఒక్క హామీతోనే వారు గట్టెక్కుతారని కూడా భావించడం లేదు. ఎరువులపై సబ్సిడీ ఇవ్వాలి. ఉచితంగా విద్యుత్తు ఇవ్వాలి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి.

ఇలాంటి ఆలోచనలను నేను చేస్తుంటే, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. వాళ్లకు వాళ్ల కుటుంబాలు బాగుంటే చాలు. వాళ్లు దోచుకుని బాగుపడితే చాలు. రైతులకు మేలు జరిగే నిర్ణయాలను భరించలేకపోతున్నారు. ఆత్మస్థైర్యం కోల్పోయిన వారిలో మరిన్ని అనుమానాలను కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దారుణం!