November 6, 2012

ఆ పదవికే కాదు.. ప్రజా జీవనానికీ పనికిరాడు,అహంతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడు

అన్నింటా అనర్హుడీ సీఎం!
ఆ పదవికే కాదు.. ప్రజా జీవనానికీ పనికిరాడు
అహంతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడు
ఇంత వరదొచ్చినా కంట్రోల్ రూమే లేదు
బిచ్చం వేసినట్టు బియ్యం పంపిణీ
ఏమైనా అందామంటే సభ్యత అడ్డొస్తుంది
కిరణ్‌రెడ్డి కాదు.. కిరికిరి రెడ్డి అంటూ నిప్పులు
కేంద్రంలో పదిమంది మంత్రులుండి ఏమి చేస్తున్నారని ప్రశ్న


రాష్ట్రంలోని వరద ముంపు ప్రాంతాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా పర్యటించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రం తక్షణమే సహాయక చర్యలను చేపట్టాలని కోరారు. ఓ వైపు తుఫాను ప్రభావంతో 14 జిల్లాలు అతలాకుతలం అయితే, ఈశాన్య ఋతుపవనాలతోనే వర్షాలు పడ్డాయంటూ రాష్ట్ర మంత్రులు పేర్కొంటున్నారని, వారి అజ్ఞానానికి ఇది పరాకాష్ట అన్నారు. రైతుల రుణమాఫీపై సాకులు చెబుతున్న సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి తనపేరును కిరికిరిరెడ్డిగా మార్చుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రను మంగళవారం చంద్రబాబు పునఃప్రారంభించారు. ధన్వాడ మండలం రాంకిష్టాయిపల్లి వద్ద మీడియాతోనూ కొండాపూర్, కిష్టాపూర్‌ల్లో జరిగిన సభల్లోనూ వరద సహాయ చర్యలపై ప్రభుత్వ నిర్లిప్తతను తూర్పారబట్టారు. తుఫాను కారణంగా వేల కోట్ల రూపాయల నష్టం జరిగినా ప్రభుత్వానికి కన్పించడం లేదని విమర్శించారు. వరద ప్రాంతాల్లో పర్యటించే తీరిక సీఎంకు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి గంట కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు. ఇంత నష్టం జరిగినా సచివాలయంలో కనీసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు.

తుఫాను బాధిత ప్రాంతాల్లో ప్రధాని, సోనియా పర్యటించి సమీక్షించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు పది కిలోల బియ్యం ఇవ్వడమేమిటని నిలదీశారు. 'భిక్షం వేస్తున్నారా?' అని మండిపడ్డారు. కుటుంబానికి 20 కిలోల బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కిరణ్ అహంతో వ్యవహరిస్తున్నారని, మొత్తం వ్యవస్థను ఆయన నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఒక్క సీఎం పదవికే కాదని, ప్రజాజీవితానికే ఆయన అనర్హుడని పేర్కొన్నారు. ఇంకా విమర్శలు చేయాలని ఉన్నా సభ్యత అడ్డువస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్రం నుంచి పది మంది కేంద్ర మంత్రులు ఉన్నా వారంతా ఏం చేస్తున్నారని బాబు ప్రశ్నించారు. 14 జిల్లాల్లో వరదలతో ఆస్తి, పంట నష్టం భారీగా జరిగినా, ప్రధానిని ఎందుకు తీసుకురాలేక పోతున్నారని నిలదీశారు. సొంత పనుల కోసమే మంత్రి పదవులు పొందారా అని నిలదీశారు. వరదలపై ఒక్క కేంద్ర మంత్రీ స్పందించకపోవడం దారుణమన్నారు. అంతకుముందు.. ఉదయం 10.30 గంటలకు పున ఃప్రారంభించిన పాదయాత్ర ధన్వాడ, కోయిల్‌కొండ మండలాల్లో 15 కిలోమీటర్ల మేర కొనసాగింది.

కిష్టాపూర్, కొండాపూర్ గిరిజన తండాల్లో జరిగిన సభల్లో స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. "నేను అధికారంలోకి వచ్చాక, రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తాను. మైదాన ప్రాంత లంబాడాలకు ఐటీడీఏ తరహాలో ప్రత్యేక అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తా''మని తెలిపారు.
No comments :

No comments :