November 7, 2012

ఎర్రన్న మరణంలో కుట్ర? టీడీపీ శ్రేణుల అనుమానం,సమగ్ర విచారణకు డిమాండ్



ఎర్రన్న మరణంలో కుట్ర?
టీడీపీ శ్రేణుల అనుమానం
తారు ట్యాంకరు రాత్రి 8 నుంచే ఉందని వాదన
సమగ్ర విచారణకు డిమాండ్
ఆక్సిజన్ వ్యవహారంపైనా చల్లారని మంటలు
(శ్రీకాకుళం - ఆంధ్రజ్యోతి) ఎర్రన్నాయుడు మృతిపై తమకు అనుమానాలున్నాయని, ఆయన వాహనాన్ని ఢీకొన్న తారు ట్యాంకరు.. ఘటనకు ఆరు గంటల ముందు నుంచీ అక్కడ ఉందని.. టీడీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తమ వాహనం రాకను గమనించే.. ఆ ట్యాంకరు డ్రైవర్ యూ టర్న్ తీసుకున్నాడని కొందరు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ తెలిపారు. ఇందులో కచ్చితంగా కుట్రకోణం ఉందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే.. పోలీసులు మాత్రం ఇది ప్రమాదమేనంటున్నారు. డ్రైవర్‌ను అరెస్టు చేసి, అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని.. అందులో అనుమానించదగ్గ నెంబర్లేవీ లేవని స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా జేఆర్‌పురం సీఐ వేణుగోపాలరావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ట్యాంకరు డ్రైవరు ఇ.శ్రీనివాస్ కుమార్‌ను ఆయన ఈ నెల మూడున అరెస్టు చేశారు. అతడు ప్రస్తుతం గార మండలం అంపోలులోని జిల్లా సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం గాజువాకకు చెందిన బి.విజయరామరాజుకు చెందిన తారు ట్యాంకరు (ఏపీ 31 టీపీ 4668)కు తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం బట్రాజుపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కుమార్ కొన్నాళ్లుగా డ్రైవరుగా పనిచేస్తున్నాడు.

ఒడిసాలో జరిగే రోడ్డు పనులకు విశాఖపట్నం నుంచి అతడు తారు తీసుకెళ్తున్నాడు. ఘటన జరిగిన రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో క్లీనరు బి.దుర్గాప్రసాద్‌తో కలసి విశాఖలో తారు లోడుతో బయలుదేరాడు. తెల్లవారు జామున రెండు గంటల సమయంలో రణస్థలం మండలం దన్నానపేట వద్ద తారు కరిగించేందుకు అవసరమైన వంట చెరకు కోసం యూటర్న్ తీసుకొన్నాడు. అదేసమయంలో.. ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న వాహనం వేగంగా వచ్చి ట్యాంకర్‌ను బలంగా ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది.

కాదు.. కుట్రే
పోలీసుల కథనంతో టీడీపీ నేతలు ఏకీభవించట్లేదు. తారు ట్యాంకరు రాత్రి 8 గంటల నుంచే దన్నానపేట వద్ద హైవే అంచున నిలిపి ఉంచినట్టు.. ఘటన జరిగిన రెండు రోజుల అనంతరం తమకు స్పష్టమైన సమాచారం అందిందని చౌదరి బాబ్జి ఆంధ్రజ్యోతికి చెప్పారు. ఎన్ని పర్యాయాలు ఫోన్ చేసినా 108 వాహనం రాకపోవడం, గంట తర్వాత వచ్చినా అందులో ఆక్సిజన్ లేకపోవడం, హైవే అంబులెన్స్‌లో కూడా ఆక్సిజన్‌తోపాటు ప్రాథమిక వైద్య ఏర్పాట్లేవీ లేకపోవడం ఇవన్నీ తమ అనుమానాలను బలపరుస్తున్నాయని చెప్పారు.

మరోవైపు ఆక్సిజన్ ఉంటే ఎర్రన్న బతికేవారని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని కవిటిలో సోమవారం నిర్వహించిన సంతాపసభలో ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ దుయ్యబట్టారు. ఈ ప్రచారంపై వైద్య విద్య, 108, 104 సర్వీసుల శాఖ మంత్రి కోండ్రు మురళీమోహన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ లేకుండా రాష్ట్రంలో ఒక్క 108 వాహనం కూడా లేదని విలేకరులతో చెప్పారు.

2 comments :

2 comments :

Manavu said...


తెలుగు తమ్ముళ్లూ, అంతా విధి రాత ప్రకారమే జరుగుతుంది.మీ చంద్రబాబు గారి గురించి బ్రహ్మం గారి కాలజ్గ్ణానం లో రాయబడి ఉంది. మీకు తెలుసా?!

arjun said...

teliyadu sir, కాలజ్గ్ణానం లో ala kuda rasaraa..?