November 7, 2012

మెదక్ జిల్లాలో కొనసాగించనున్న పాదయాత్ర దారులను, రాత్రి బస చేసే ప్రాంతాలను పరిశీలించిన పార్టీ నాయకులు



ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి వస్తున్నా మీకోసం ద్వారా పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మెదక్ జిల్లాలో కొనసాగించనున్న పాదయాత్ర దారులను, రాత్రి బస చేసే ప్రాంతాలను మంగళవారం నాడు ఆ పార్టీ నాయకులు పరిశీలించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణం నుంచి సదాశివపేట మండలం ముబారక్‌పూర్ (బి) గ్రామం మీదుగా పంట పొలాలను పరిశీలిస్తూ పెద్దాపూర్ వద్ద జాతీయ రహదారిపైకి చేరుకుని నందికంది మీదుగా సదాశివపేట పట్టణానికి చేరుకుని పట్టణ శివార్లలో బస చేసేవిధంగా నాయకులు దారిని నిర్ధారించారు. రాత్రి బస మాత్రం సదాశివపేట పరిధిలోని ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్లు, అయ్యప్ప మందిర ప్రాంతం, మద్దికుంట చౌరస్తా తదితర ప్రదేశాలను గుర్తించారు. ఇందులో ఎదో ఒక ప్రాంతాన్ని నిర్ణయించే అవకాశాలున్నాయని మండల పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల అమరేందర్‌రెడ్డి తెలిపారు. మరుసటి రోజు ఆరూర్ మీదుగా మునిపల్లి మండలం బుదేరాకు వెళ్లనున్నారు. ఈ దారులను పరిశీలించడానికి రాజ్యసభ మాజీ సభ్యులు కంభంపాటి రాంమ్మోహన్‌రావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు, పటన్‌చెరు కార్పొరేటర్, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సపాన్‌దేవ్, సిడిసి మాజీ చైర్మన్ మాణిక్యం, మాజీ ఎంపిటిసి శివకుమార్, మాజీ సర్పంచులు మునిపల్లి నర్సింలు, బెల్లం బస్వరాజ్‌తో పాటు పట్టణానికి చెందిన టిడిపి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.
No comments :

No comments :