October 20, 2012

పూరీ ‘ జగన్ ‘….. ‘ జగన్ ‘ మనిషా …???







పూరీ ‘ జగన్ ‘….. ‘ జగన్ ‘ మనిషా …???

ఇంతకాలానికి గురువుని మించిన శిష్యుడు…. అనిపించుకున్నాడు పూరీ జగన్నాధ్. ఇప్పటివరకు కధలనో, హీరో ఇమేజ్ నో, పంచ్ డైలాగులనో నమ్ముకుని సినిమాలు తీసిన పూరి తొలిసారి వివాదాల కోసం, ఓ పార్టీని, ఓ రాజకీయ నేతనీ కొమ్ముకాయడానికి ఓ సినిమా తీసాడేమో అనే అనుమానం వేస్తోంది. వివాదాన్నే ఆయుధంగా చేసుకుని సినిమాని చుట్టేయడం రామ్ గోపాల్ వర్మ స్టైల్. ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ కోసం వర్మ శిష్యుడు జగన్ కుడా ఆ దారినే ఎంచుకున్నాడు. రాజకీయాలపైన, సినిమాలపైన కనీస అవగాహన ఉన్న ఎవరికైనా… ‘….రాంబాబు’ సినిమా చూస్తే మూడు విషయాలు అర్ధమైపోతాయి.
1. వై యస్ రాజ శేఖర రెడ్డి ని హీరోగా చూపిద్దాం అనేది పూరి ప్రధాన ఉద్దేశ్యం. సీ యం పాత్ర నాజర్ పోషించారు. ఆ పాత్రకు ఆయన పెట్టిన పేరు… ‘చంద్ర శేఖర రెడ్డి’. ఆపాత్ర వై యస్ ఆర్ ని పోలి ఉంటుంది.
2. ఈ సినిమాలో ప్రతినాయకుడు ప్రకాష్ రాజ్. ఈయన పేరేమో…. ‘రానా బాబు’. తిరగేస్తే… ‘నారా బాబు’. అది చంద్రబాబు కి పేరడి అని వేరే చెప్పాలా.? “రాజకీయాలంటే ఎన్ని ఒత్తిడిలో నేకేం తెలుసు… అది భరించలేక ‘బొల్లి’ కుడా వచ్చేస్తుంది” అని రానా బాబు చేత చెప్పించారు. ఆరోగ్య సమస్యలను అపహాస్యం చేస్తూ.. అదే సృజనాత్మకత అని మురిసిపోవడం పూరి లాంటి దర్శకుడికి ఎంతవరకు సమంజసం?
3. సున్నితమైన తెలంగాణా సమస్యపై… పూరి తన వైఖరిని ప్రకటించడానికి ఈ సినిమాని ఓ వేదికగా చేసుకున్నాడు. పవన్ కళ్యాన్ భావాల పేరిట.. తన అభిప్రాయాన్ని బలవంతంగా ప్రేక్షకులపై రుద్దే ప్రయత్నం చేసాడు.



పూరి జగన్నాధ్ వై యస్ అభిమాని అనే విషయం సుస్పష్టం. ఈ విషయాన్ని పూరీ నే చాలా సార్లు బహిరంగంగా చెప్పారు. రాజశేఖర్ రెడ్డి జీవితకథను సినిమాగా తీసే ప్రయత్నం కుడా చేసారు. అంతెందుకు… పూరి తమ్ముడు గణేష్ … వై యస్ ఆర్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న వ్యక్తే. ఉపఎన్నికల సందర్భంలో పూరి స్వగ్రామం ‘నర్సీపట్నం’ని విజయమ్మ, షర్మిల సందర్శించారు అప్పుడు వాళ్ళిద్దరి బస… పూరి ఇంట్లోనే. ‘మీ రాకతో నా జీవితం పునీతం అయ్యింది’ అని పూరి ఓ స్టేట్మెంట్ కుడా ఇచ్చాడు. పూరి కుమార్తెకు ‘పరికిణి’ వేసినప్పుడు… ఆ శుభ కార్యానికి జగన్ అతిథిగా వెళ్ళడం అందరికి గుర్తే. అప్పటి నుంచి పూరి…. జగన్ కి ఫ్యాన్ అయిపోయాడు. ఆ అభిమానం … ‘….రాంబాబు’ సినిమాతో చూపించేసాడు.


సినిమా అనేది ఓ వినోద సాధనం మాత్రమే అని తరచూ చెప్పే పూరి.. మొదటిసారి తన సరిహద్దుని విస్మరించాడు. సినిమాని సినిమాగా తీయకుండా, సినిమాని సినిమాగా చూడకుండా… తన స్వలాభం కోసం, స్వంత ప్రయోజనాల కోసం, తన మనుషుల మెప్పుకోసం …. వాడుకున్నాడు. సున్నితమైన విషయాలలో తన వైఖరిని ఘాటుగా ప్రకటించి.. ఎంతో మంది మనోభావాలను దెబ్బతీసాడని సినీ పెద్దలు సైతం అభిప్రాయపడుతున్నారు. నిర్మాతల సొమ్ముతో చెలగాటం ఆడేసాడు. పవన్ సినిమాలకు బ్రహ్మరధం పట్టే నైజాం అబిమానులు పోస్టర్లు పీకి, ప్రింట్లు తగలెట్టేస్తున్నారంటే దానికి కారణం ఎవరు? పవన్ వ్యక్తిగత ఇమేజ్ కి భంగం కలిగించడంలో పూరి ఉద్దేశ్యం ఏమిటి? ‘రాజకీయాలపై నాకు అవగాహన లేదు’ అని చెప్పుకునే పూరి…. ఆ నేపద్యంలో సినిమా తీసే దుస్సాహసానికి ఎందుకు ఒడిగట్టాడు? అనేవి సమాధానం లేని ప్రశ్నలు. ఈ సినిమాలో పూరీ తెలంగాణా ఉద్యమాన్ని అవహేళన చేసే విధంగా కొన్ని సన్నివేశాలను చిత్రికరించాడని ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. అంటే పరోక్షంగా వై.ఎస్ జగన్ తెలంగాణాకు వ్యతిరేకి అని పూరీ చెప్పదలచుకున్నాడా ?
‘నా పారితోషికం ఎగ్గోట్టాడు’ అని నిర్మాతలపై.. ఫిర్యాదు చేసిన పూరి… ఇప్పుడు వాళ్లకు జరిగిన నష్టానికి ఎంతవరకు బాద్యత వహిస్తాడు? ‘….రాంబాబు’ సినిమాలో 12 సన్నివేశాలను తొలగిస్తాం అని చెప్పారు. 60 లో 12 కత్తిరిస్తే ఇక మిగిలేది ఏమిటి? అతుకుల బొంత ప్రేక్షకులకు అర్ధమవుతుందా? జగన్ పై అభిమానం ఉంటే … మిగతా పార్టీలపై గుర్రు ఉంటే … మరోలా తన స్పందనలను తెలియచేయవలసింది. లేదంటే సొంత డబ్బుతో ఓ సినిమా తీసుకుంటే ఏ గొడవా ఉండక పోదును. పక్కవాడి డబ్బుతో జూదం ఆడి, దానికి పవన్ ఇమేజ్ పణంగా పెట్టడం ఎంతవరకు భావ్యమో తనకు తానే ప్రశ్నించుకోవాలి.
No comments :

No comments :