October 20, 2012

రాష్ట్రమే నా కుటుంబం.. ప్రజలే కుటుంబ సభ్యులు 19వ రోజు పాదయాత్రలో చంద్రబాబు నాయుడు

chandrababu naidu vastunna meekosam padayatra at kurnool dist

ముఖ్యమంత్రి అవుతా.. మీ కష్టాలు తీరుస్తా
రాష్ట్రమే నా కుటుంబం.. ప్రజలే కుటుంబ సభ్యులు
వారి కష్టాలు చూసి కన్నీళ్లొస్తున్నాయి..
రుణ మాఫీ ఎలాగో చేసి చూపిస్తా
నల్ల ధనాన్ని కాపాడుకునేందుకే నల్ల బ్యాడ్జీ యాత్రలు
తప్పులేమీ లేకుండానే జైల్లో పెడతారా!?..


"నేను దాదాపు అన్ని పదవులూ చేశాను. వాటిపై అనురక్తి లేదు. రాష్ట్రమే నా కుటుంబం. కష్టాల్లో ఉన్న ప్రజలే మా కుటుంబ సభ్యులు. వారి కష్టాలు చూసి కన్నీళ్లు వస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలు, రైతులు, విద్యార్థులు, బడుగు వర్గాలు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. నేను మళ్లీ ముఖ్యమంత్రినై వారందరి కష్టాలు తీరుస్తాను'' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.

రైతులను ఆదుకునేందుకు రుణాల మాఫీ ఒకటే సరిపోదని, 9 గంటలపాటు ఉచిత కరెంట్, పంటలకు గిట్టుబాటు ధర, నాణ్యమైన విత్తనాలు, అందుబాటులో ఎరువులు తదితర కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయ రంగానికి ఊపిరి పోస్తానని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ కమీషన్ల పార్టీగా మారిపోయిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు 19వ రోజు పాదయాత్ర శనివారం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ మండలంలోని కంపాడు నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా కంపాడులో చంద్రబాబు కొర్ర పంటను కోశారు. ఉల్లి పంటను తీశారు. సజ్జలను సంచీల్లోకి పోశారు. డ్రమ్స్ వాయించారు. వికలాంగులతో ముచ్చటించారు.


నల్ల ధనాన్ని కాపాడుకునేందుకే కొందరు నల్ల బ్యాడ్జీలతో యాత్రలు ప్రారంభించారని, తన పాదయాత్రకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే పోటీ యాత్ర చేపట్టారంటూ పరోక్షంగా కడప ఎంపీ వైఎస్ జగన్ చెల్లెలు షర్మిలను ఆయన విమర్శించారు. ఏ తప్పులూ చేయకుండానే జైల్లో పెడతారా..? అని ప్రశ్నించారు. వైఎస్ ఐదేళ్ల 3 నెలల పాలనలో రాష్ట్రం కుప్పకూలిందని ధ్వజమెత్తారు.

తన హయాంలో 1.6 లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. ఐటీ రంగంలో రాష్ట్ర యువత ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్నారని, ఆ ఘనత తనదేనని చంద్రబాబు చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఉద్యోగాలపై శ్రద్ధ లేదని, గంజి తాగి పిల్లలను చదివించుకున్న నిరుపేదలు వారికిఉద్యోగాలు రాక అప్పుల్లో కూరుకుపోతున్నారన్నారు.

నా జీవితంలో ఈనెల 18 మరువలేనిది
తన జీవితంలో సెప్టెంబర్ 18వ తేదీ మరువలేనిదని, ఎమ్మిగనూరు ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న 13 మంది చేనేత కార్మికుల ఆత్మ శాంతికి ఉపవాసం పాటించిన రోజని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కాగా, కాళ్లనొప్పితో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును పరామర్శించేందుకు ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ట, చిన్న అల్లుడు శ్రీనివాసరావు, చంద్రబాబు కుమారుడు లోకేష్ వచ్చారు. చంద్రబాబు వెంట లోకేష్, శ్రీనివాసరావు నడక సాగించారు.
No comments :

No comments :