October 20, 2012

కర్నూలు జిల్లా కంపాడులో శనివారం 19వ రోజు పాదయాత్రను ప్రారంభించిన చంద్రబాబునాయుడు 20.10.2012

దోచుకున్నవారంతా జైలుకు వెళుతున్నారు
ప్రజలకు తాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం
సిబ్బందిలేక గ్రామాల్లో అంటువ్యాధులు, విషజ్వరాలు
టీడీపీ హయాంలో ఎక్కువ ఉద్యోగాలు

  దివంగత వైఎస్ హయంలో దోచుకున్న నేతలు, అధికారులు జైలుకు వెళుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం పెద్దల తప్పుడు నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి పరులవల్ల మోయలేని ఆర్థిక భారం ప్రజలపై పడుతోందని, ప్రభుత్వం కనీసం ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని బాబు విమర్శించారు.

కర్నూలు జిల్లా కంపాడులో శనివారం 19వ రోజు పాదయాత్రను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ పంచాయతీ సిబ్బందిలేక గ్రామాల్లో అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రభలుతున్నాయని అన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, మరోవైపు పంటలు పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నారు. టీడీపీ హయాంలోనే ఎక్కువ ఉద్యోగాలు కల్పించినట్లు చంద్రబాబు తెలిపారు.

జిల్లాలో చంద్రబాబునాయుడు శనివారం ఉదయం కంపాడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఆయన వెంట కుమారుడు లోకేష్ నాయుడు, బావమరిది రామకృష్ణ ఉన్నారు. ఈరోజు 16.1 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర సాగనుంది.

కాగా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ శుక్రవారం సాయంత్రం చంద్రబాబు బసచేసే గ్రామమైన కర్నూలు జిల్లా బెళగల్ మండలం కంపాడు గ్రామానికి చేరుకున్నారు. చంద్రబాబు చేస్తున్న పాదయాత్రలో రెండు రోజుల పాటు పాల్గొనేందుకు ఆయన వచ్చారు. పాదయాత్ర ముగించుకొని బస చేసిన ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబును లోకేష్ కలుసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

నేటి పాదయాత్ర షెడ్యూల్డ్

చంద్రబాబు నాయుడు మీ కోసం పాదయాత్ర 19వ రోజు శనివారం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో సాగనుంది. కంపాడు గ్రామం నుంచి శనివారం ఉదయం 9.00గంటలకు పాదయాత్ర ప్రారంభమయింది. మధ్యాహ్నం సి.బెళగల్ గ్రామానికి చేరుకున్నారు. మార్గమధ్యంలో రైతులతోను, రైతు కూలీలతోను సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

అలాగే బెళగల్ సమీపంలో ఉన్న చెరువును పరిశీలిస్తారు. మధ్యాహ్న భోజనం అక్కడే చేస్తారు. తిరిగి 2గంటలకు బెళగల్ గ్రామం నుంచి యాత్ర ప్రారంభమై పోలకల్ గ్రామానికి 3 గంటలకు చేరుకుంటారు. మార్గమధ్యంలో జీఆర్పీ రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. అలాగే రైతులతో మాట్లాడతారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4గంటలకు ప్రసంగిస్తారు. అక్కడి నుంచి 5 గంటలకు యాత్ర ప్రారంభమై రాత్రికి జూలకల్ గ్రామానికి చేరుకొని అక్కడే బసచేస్తారు. 

chandrababunaidu padayatra vastunnameekosam at kurnool dist 20.10.2012
No comments :

No comments :