September 9, 2013

అసమర్ధ ప్రధాని కావడం వల్లే ఎవరికి దొరికినంత వారు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు...

ఆత్మగౌరవం కాపాడతా
దేశాన్ని పాలిస్తున్న నేతలు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నా
రు. ఆత్మగౌరవయాత్రలో భాగంగా ఆదివారం రాత్రి రెడ్డిగూడెం విచ్చేసిన బాబు పాలకుల అవినీతిని ఎండగట్టారు. రెడ్డిగూడెం మొదటిసారిగా వచ్చాననీ, మీ ఆదరణ మరవలేనిదని ఆయన పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన ఎన్టీఆర్ పుట్టినగడ్డ కృష్ణాజిల్లా కావడం, తనకు ఈ జిల్లా ప్రజలంటే గౌరవమన్నారు.
కాంగ్రెస్ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. అసమర్ధ ప్రధాని కావడం వల్లే ఎవరికి దొరికినంత వారు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. బొగ్గుకు సంబంధించి 190 ఫైళ్ళు మాయమయినా ప్రధానికి చీమకుట్టినట్లైనా లేదని వాపోయారు. సోనియా చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారడంతో అవినీతికి హద్దులేకుండా పోయిందన్నారు. అవినీతి కారణంగా దేశ ప్రజలు కోలుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. ధరలు అదుపుచేయలేని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యవసాయరంగం కుదేలైపోయిందన్నారు. మరోపక్క సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు వాపోయారు.
జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకుని కాంగ్రెస్ నాయకులు కోట్లు దండుకుంటున్నారని ఆరోపిం చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తా.. ప్రజాసమస్యలు, ధరలు దారిలోకి తెస్తానంటూ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. లక్షలకోట్లు దోచుకున్న వారు రాష్ట్రాన్ని ఏలాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఇటలీకి- ఇడుపులపాయకు సంధి కుదిరిందని, ఈనేపథ్యంలో ఇటలీ సోనియా రూ.5లక్షల కోట్లు దోచుకోగా, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారానికి రూ.100కోట్లు దోపిడీ చేశారన్నారు. ఈ అవినీతిని తెలుసుకున్న రాష్ట్రప్రజలు గత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీని చిత్తుగా ఓడించారన్నారు. రానున్నకాలంలో దేశం పార్టీ రెపరెపలాడుతుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే రాష్ట్రానికి రావాల్సిన కృష్ణాజలాల హక్కును సాధించితీరతానన్నారు.
విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడగలనని హామీఇచ్చారు. సింగపూర్ తరహాలో హైదరాబాద్‌ను అభివృద్ది చేశానన్నారు. కుట్రలోభాగంగా రాష్ట్రాన్ని కొన్నిశక్తులు విడదీసి రాజకీయ లబ్దిపొందటానికి సన్నాహాలు చేయడాన్ని ఆయన ఖండించారు.
గత 38 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే కేంద్రప్రభుత్వానికి కన్పించడం లేదా అని ప్రశ్నించారు. తెలుగువారి పరువు ప్రతిష్ఠ కాంగ్రెస్ మంటకలిపిందని తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాను కాపాడతానన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడగల సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు. ఒక కుటుంబం వల్ల రాష్ట్రం, ఒకవ్యక్తి కారణంగా దేశం అవినీతి అసమర్దతతో చిన్నాభిన్నం అయ్యాయని వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు చక్కిదిద్దబడతాయన్నారు. కేశినేని నాని, దేవినేని ఉమా, వర్ల రామయ్యలు ప్రసంగించారు.