September 9, 2013

అట్టడుకుతున్న రాష్ట్రం కాంగ్రెస్కనుసైగల్లో టీఆర్ఎస్,వైసీపీ ఆత్మగౌరవ యాత్రలో బాబు

కృష్ణా, సెప్టెంబర్ 9 : గత 40 రోజులుగా రాష్ట్రం అట్టడుకుతుంటే, కేంద్రానికి చీమకుట్టినట్టయినా లేదని, కేంద్రం ఏం చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఇరు ప్రాంతాల వారితో చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆత్మగౌరవ యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం వినాయకచవితి సందర్భంగా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంలో వినాయక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. అయంతరం ఆయన మాట్లాడుతూ ఢిల్లీ నేతల కనుసైగలతో టీఆర్ఎస్, వైసీపీ పార్టీలు నడుస్తున్నాయని, ఈ రెండు పార్టీలు ఏం మాట్లాడాలో కేంద్రం నుంచే స్క్రీప్ట్ వస్తుందని ఆయన అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి నెలకొందని, దేశంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సమస్యలన్నీ తొలగిపోయి, దేశానికి, తెలుగుజాతికి పూర్వవైభవం రావాలని వినాయకున్ని ప్రార్థించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులు వెళుతున్న బస్సులపై కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేశారని, అలాగే సీమాంధ్రలో కాంగ్రెస్, వైసీపీలు దాడులకు ఎగబడుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. వాళ్లు దాడులు చేసి రెండు ప్రాంతాల్లో టీడీపీని విమర్శిన్నాయని ఆయన మండిపడ్డారు.