September 24, 2013

'బీజేపీ మనతో కలిసి వస్తానని అడుగుతోంది. మీ అభిప్రాయం ఏంటి?

బీజేపీతో పొత్తు పర్యవసానాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీలో అంతర్గతంగా చర్చకు తెరదీశారు. మంగళవారం రాత్రి ఇక్కడ ఖమ్మం జిల్లా పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు ఆయన ఈ అంశంపై వారి అభిప్రాయం కోరినట్లు సమాచారం. 'బీజేపీ మనతో కలిసి వస్తానని అడుగుతోంది. మీ అభిప్రాయం ఏంటి?' అని చంద్రబాబు వారిని అడిగారు. కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న జిల్లా కావడంతో ఖమ్మం జిల్లా నేతలు ఆచితూచి మాట్లాడారు. 'ఖమ్మం సహా రెండు మూడు జిల్లాల్లో కమ్యూనిస్టులకు పట్టు ఉంది. మిగిలిన చోట్ల లేదు. బీజేపీకి గట్టిగా ఏ జిల్లాలోనూ పట్టు లేదు. కానీ, రాష్ట్రం అంతటా అన్నిచోట్లా ఎంతో కొంత ఓట్లు ఉన్నాయి. మీరు రాష్ట్రం మొత్తం మీద పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి. మీరు ఏ నిర్ణయం తీసుకొన్నా మేం నిలబడి పనిచేస్తాం' అని వారు చెప్పారు.


మైనారిటీ కోణం గురించి కూడా చర్చ జరిగింది. బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా మైనారిటీల ఓట్లు టీడీపీకి పెద్దగా వచ్చే అవకాశం లేదని, మొదటి నుంచి పార్టీతో ఉన్నవారు ఎలాగూ వేస్తారని, మిగిలిన వారివి కాంగ్రెస్‌కు వెళ్ళే అవకాశం ఉందని కొందరు నాయకులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మాత్రం తన అభిప్రాయం ఏదీ చెప్పకుండా వ్యూహాత్మకంగా మాట్లాడారు. 'ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. పొత్తులపై మనం అప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. మున్ముందు పరిస్ధితులు ఎలా రూపుదిద్దుకొంటాయో చూసి దానిని బట్టి నిర్ణయం తీసుకొందాం. పొత్తు ఉన్నా లేకపోయినా... మనతో ఎవరు కలిసి వచ్చినా... ఎవరూ రాకపోయినా మనం సొంతంగా గెలవటానికి తగిన వ్యూహంతో వెళ్ళాలి. ఆ దిశగా పనిచేయాలి.

రాష్ట్రం ఒకటిగా ఉన్నా, రెండుగా విడిపోయినా రెండు ప్రాంతాల్లో మనం బలంగా ఉండాలి. రెండువైపులా గెలవాలి. కాంగ్రెస్ ఒకవైపు టీఆర్ఎస్‌ని, రెండోవైపు వైసీపీని కలుపుకొని బలపడాలని చూస్తోంది. టీఆర్ఎస్‌ను విలీనం చేసుకొంటుంది. వైసీపీని తాను ఎలా ఆడిస్తే అలా ఆడే పరిస్థితిలోకి తెచ్చుకొంది. ఇప్పుడు బెయిల్ వచ్చినా రేపు తేడా వస్తే ఈడీని రంగంలోకి దించి మరోసారి జైలుకు పంపిస్తామని అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేసింది. ఆ పార్టీ గేమ్ ప్లాన్‌ను అమలు చేయడం తప్ప జగన్‌కు ఇప్పుడు మరో ప్రత్యమ్నాయం లేదు' అని ఆయన పేర్కొన్నారు. రెండు ప్రాంతాల్లో రెండు పార్టీలను ముందు పెట్టుకొని కాంగ్రెస్ ఆటాడుతోందన్న అంశం ప్రజల్లోకి బలంగా వెళ్తే ఆ మూడు పార్టీలు మట్టి కరవడం ఖాయమని, మంచి పాలన కావాలంటే టీడీపీయే శరణ్యమన్న అభిప్రాయాన్ని ప్రజల్లో బలంగా కలిగించాలని ఆయన వారికి సూచించారు.