September 25, 2013

ఒకే వేదికపై కలుసుకొంటారా? ఒకరినొకరు పలకరించుకుంటారా?

మోదీ.. బాబు.. కలుసుకుంటారా?



గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఒకే వేదికపై కలుసుకొంటారా? ఒకరినొకరు పలకరించుకుంటారా? ఢిల్లీలో జరిగే ఒక రాజకీయేతర సమావేశంలో ఈ సన్నివేశం చోటు చేసుకోనుందా? అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 'సిటిజన్స్ ఫర్ అకౌంటింగ్ గవర్నెన్స్' అనే స్వచ్ఛంద సంస్థ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2నఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో విద్యార్థులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీ ప్రారంభోపన్యాసానికి చంద్రబాబును.. ముగింపు ఉపన్యాసానికి మోదీని ఆహ్వానించింది. బాబు ప్రసంగం ఉదయం ఉంటే.. మోదీ ప్రసంగం సాయంత్రం ఉంది.

ఈ సమావేశంలో వీరిద్దరూ కలిసి పక్కపక్కన కూర్చుంటారా లేక కనీసం మాట్లాడుకొంటారా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. సమయాలను బట్టి చూస్తే ఈ ఇద్దరూ కలిసి పాల్గొనే అవకాశం లేదని చెబుతున్నారు. కానీ కలవాలని అనుకొంటే మాత్రం ఈ ఇద్దరూ ఈ భేటీని ఒక అవకాశంగా వినియోగించుకొనే చాన్స్ లేకపోలేదనీ అంటున్నారు. విద్యార్థులతో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి తాను వెళ్తున్నట్లు చంద్రబాబు తమ పార్టీ నేతలకు తెలిపారు. మోదీ-బాబు సుమారు ఒక దశాబ్ద కాలంగా కలుసుకోలేదు. గుజరాత్ మత కల్లోలాలకు బాధ్యునిగా మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని అప్పట్లో చంద్రబాబు పట్టుబట్టడం వీరి మధ్య సంబంధాలను తెంచివేసింది. 2004 ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినప్పుడు ఆ పార్టీ ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలకు చంద్రబాబు ఇక్కడి జూబిలీ హాల్‌లో విందు ఇచ్చారు.

ఆ సమయంలో మోదీ నగరంలోనే ఉన్నా ఆ విందుకు హాజరు కాలేదు. ఇవన్నీ జరిగి పదేళ్లు కావడంతో ఆ సంఘటలన్నీ పాతబడ్డాయి. కొత్త సంబంధాలపై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 'పదేళ్ల కిందట ఎలా ఉన్నామో అలాగే ఉండాలా? మార్పులు రావా' అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ప్రశ్నించారు . కాగా, అక్టోబర్ ఐదో తేదీ నుంచి చంద్రబాబు మలి విడత యాత్ర మొదలు కానుంది. ఈసారి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.