September 25, 2013

లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినా కాంగ్రెస్ పార్టీ దులుపుకొని తిరుగుతోంది

జాతీయ రాజకీయాల్లో నా పాత్ర పెంచుతా: చంద్రబాబు


వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్ధాపితం చేసే నిమిత్తం జాతీయ రాజకీయాల్లో తన పాత్ర పెంచాలని అనుకొంటున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఆయన ఇక్కడ తన నివాసంలో వరంగల్ జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తొమ్మిదేళ్ళ పాలనలో అవినీతి కనీవినీ ఎరుగని స్ధాయికి పెరిగిపోయి దేశం భ్రష్టు పట్టి పోయిందని, ఆ పార్టీని దించకపోతే దేశం సర్వ నాశనమయ్యే పరిస్ధితి వచ్చిందని ఆయన అన్నారు.
'బొగ్గు గనుల కుంభకోణంలో ఫైళ్ళు మాయం కావడంతో ఏకంగా ప్రధాని కూడా సిబిఐ విచారణను ఎదుర్కోవాల్సిన దుస్ధితి వచ్చింది. లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినా కాంగ్రెస్ పార్టీ దులుపుకొని తిరుగుతోంది. ఇదే పరిస్ధితి ఉంటే దేశం కుప్పకూలడం ఖాయం. అవినీతి కేసుల్లో నిందితులందరికీ కఠిన శిక్షలు పడేలా చేసి మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా చేస్తేనే మన దేశాన్ని, సమాజాన్ని కాపాడుకొన్నవారం అవుతాం. అది జరగాలంటే కాంగ్రెస్ పార్టీ దిగిపోవాలి. అందుకే జాతీయ రాజకీయాల్లో నా పాత్ర పెంచాలని అనుకొంటున్నాను. మనతో భావసారూప్యం ఉన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. వాటిని కూడగట్టి కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను బలోపేతం చేస్తాను. గతంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రతి కాంగ్రెస్ వ్యతిరేక కూటమిలో టిడిపి ప్రధాన పాత్ర పోషించింది. ఈసారి కూడా అటువంటి పాత్రను తీసుకొందాం. అది జరగాలంటే ఇక్కడ రెండు ప్రాంతాల్లో మనం బలంగా ఉండాలి. రెండు వైపులా మెజారిటీ సీట్లు సాధించాలి. ఇదే మన లక్ష్యం' అని ఆయన వారితో అన్నారు.
courtessy: andhrajyothy