September 1, 2013

ప్రారంభమైన చంద్రబాబు తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర

పల్నాడులోని పొందుగల నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాలు ఉద్యమిస్తున్న కీలక తరుణంలో చంద్రబాబు చేపడుతున్న యాత్ర సర్వత్రా ఆసక్తిని రేకేత్తిస్తోంది. బాబు యాత్రను వ్యతిరేకించాల్సిందిగా వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో గుంటూరు, కష్ణా జిల్లాల్లోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. అడ్డుకునే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని నేతలు వేణుగోపాల్‌రెడ్డి, శ్రీధర్, కోడెల శివప్రసాద్ హెచ్చరించారు. రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్, వైసీపీలు సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీని దోషిగా నిలబెట్టేందుకు చేస్తోన్న కుట్రలు, కుతంత్రాలను ఎండగట్టేందుకే చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేపడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చినప్పుడే వెనకబడిన ప్రాంతాల అభివద్ధి, ఇరు ప్రాంతాలు న్యాయం చేయాలని తాము సూచించామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అసలు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఆర్టికల్-3 ప్రకారం ర్రాష్టాలను విభజించాలన్నా, కలపాలన్నా నిర్ణయం తీసుకొనే అధికారం కేంద్రానికి ఉందని మార్గనిర్దేశం చేసిన వైసీపీకి తెలుగుదేశం పార్టీ గురించే మాట్లాడే అర్హత ఎక్కడిదని వారు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల కోసం తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో వైసీపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఆడిస్తున్న రాజకీయ నాటకమే ఇదంతా అని ఆరోపిస్తున్నారు. నాడు వైఎస్ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అధిష్ఠానం వద్దకు తీసుకెళ్లి విభజనకు బీజం వేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొని కేంద్రం, రాష్ట్రంలో ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇప్పించారు.
యూపీయే కామన్ మినిమం ప్రోగ్రాం, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చించింది వైఎస్ విభజన వక్షాన్ని పెంచారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అలానే 2011లో వైసీపీ ప్లీనరీలో తెలంగాణకు అనుకూలంగా జగన్ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆర్మూరులో జరిగిన దీక్షలో వైఎస్ విజయలక్ష్మి స్వయంగా తెలంగాణకు తాము అనుకూలమని ప్రకటించారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన స్థానాల్లో ఆ పార్టీ పోటీకి పెట్టలేదు. ఇలా వైఎస్ నాటిన రాష్ట్ర విభజన బీజాన్ని వైసీపీ పెంచి పొషించి నేడు రాష్ట్రం విడిపోవడానికి దారి తీసేలా చేసిందని ఆరోపిస్తున్నారు.
విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి సీమాంధ్ర ఉద్యమాలతో అట్టుడుకుతుంటే పట్టించుకోని ప్రధానమంత్రి వైసీపీ ఎమ్మెల్యేలతో జైలులో జగన్ ఎలా ఉన్నారని ఆరా తీయడం ఆ రెండు పార్టీల మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పరాకాష్ఠగా అభివర్ణించారు. వీటన్నింటిని ఆత్మగౌరవ యాత్రలో ప్రజలకు చంద్రబాబు వివరిస్తారని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తెలిపారు. చంద్రబాబు యాత్రను విజయవంతం చేసేందుకు జిల్లా ప్రజానీకం ఎదురు చూస్తోందన్నారు. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు యాత్ర కొనసాగిస్తారని తెలిపారు. పొందుగల నుంచి ప్రారంభమయ్యే యాత్ర దాచేపల్లి, బ్రాహ్మణపల్లి, పిడుగురాళ్లకు చేరుకొంటుంది. గుంటూరు జిల్లాలో ఆరు రోజుల పాటు గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల మీదగా కొనసాగి సెప్టెంబర్ ఆరో తేదీన సాయంత్రం కష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుంది.