August 31, 2013

రాష్ట్ర విభజనైనా..రూపాయి పతనమైనా ఏడాదిలో పరిష్కరిస్




 
'కాంగ్రెస్ దద్దమ్మ పాలనతో రూపాయి పతనమైంది. ఆంధ్ర ప్రదేశ్ అంధకారంలోకి వెళ్లింది. పాలన చేతగాకపోతే నమస్కారం పెట్టి దిగిపోండి. ప్రజలు మాకు అవకాశం ఇస్తే ఏడాదిలో ఏ సమస్య అయినా పరిష్కరించి చూపిస్తా' అని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఆదివారం ఉదయం 11గంటలకు గుంటూరు జిల్లా పొందుగల నుంచి చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమస్య అయినా, ఆర్థికవ్యవస్థ పతనం అయినా ఏదైనా సరే పరిష్కరించి చూపిస్తానంటూ కాంగ్రెస్ పాలకులకు సవాల్ విసిరారు. 'వాళ్లేమీ వాళ్ల సీట్లు ఇవ్వక్కరలేదు. ఆ ముష్టి నాకు వద్దు. గద్దె దిగి ఎన్నికలు పెట్టండి.. ప్రజలే తీర్పు ఇస్తారు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

'సోనియా గాంధీ తన పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా వ్యవహరించి రాష్ట్రంలో చిచ్చు పెట్టి కూర్చుంటే మేం చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోవాలా? అంత పనికిమాలిన వాళ్లలా కనిపిస్తున్నామా? ఎలాంటి రాష్ట్రాన్ని ఎలా చేశారు? నేను ఒంటి చేత్తో రాష్ట్రపతులు, ప్రధానులు, లోకసభ స్పీకర్లను ఎంపిక చేశాను. ఈ ఇంట్లో కూర్చుని అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ఎంపిక చేసి అప్పటి ప్రధాని వాజ్‌పేయికి ఫోన్ చేసి చెప్పాను. నేను ఎంపిక చేస్తే బాలయోగి లోక్‌సభ స్పీకర్ అయ్యారు. దేవెగౌడ తర్వాత ప్రధాని బాధ్యతను జాతీయ నేతలంతా కలిసి నాకు అప్పగించారు. ఏపీ భవన్లో ఒక్కో నేతతో అరగంట మాట్లాడి గుజ్రాల్‌ను ఎంపిక చేశాను. దేవెగౌడను రాజీనామాకు ఒప్పించాను. దక్షిణ భారత దేశం నుంచి కామరాజ్ నాడార్, రాజగోపాలాచారి, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలు నడిపారు. వారి తర్వాత కాస్తో కూస్తో నేను నడిపాను' అని చంద్రబాబు పేర్కొన్నారు.

దావోస్‌లో ప్రపంచ దేశాధినేతల ఆర్థిక సదస్సు జరిగితే దానికి వెళ్లడానికి మన దేశ ప్రధానులు భయపడేవారని, అక్కడకు వెళ్తే ఓట్లు రావని దేవెగౌడ చెప్పడంతో వాజ్‌పేయి కూడా రానన్నారని, అయినా రాష్ట్రం కోసం తాను వరుసగా ఎనిమిదేళ్లు వెళ్లానని బాబు చెప్పారు. 'అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ వస్తే ఆయనను మిస్టర్ క్లింటన్ అని పిలిచాను తప్ప క్లింటన్ సర్ అని పిలవలేదు. నేను తెలుగువారి ఆత్మ గౌరవం నిలిపాను. వారిలో ఆత్మ విశ్వాసం పెంచాను. తెలుగువాడి దమ్మేంటో చూపించా...మళ్లీ చూపిస్తా' అని ప్రకటించారు. 'ఇందిరా గాంధీకి ప్రజాగ్రహం రుచి చూపించి నట్లే సోనియా కు తెలుగు ప్రజలు రుచి చూపిస్తారు' అని ఆయన వ్యాఖ్యానించారు. 'ప్రజలు మోసగాళ్లు, దొంగలనే అర్థం చేసుకొంటారా... నాలాంటి వాళ్లను అర్థం చేసుకోరా? కోట్ల మంది ప్రజలు రోడ్లపై ఉంటే నేను ఇంట్లో పడుకోవాలా? నాకు స్వార్థం లేదు.

నేను చూడని అధికారం లేదు. ఇంకా నాకు ఏం కావాలి? మహా అయితే ఇంకోసారి అధికారం రాదు. అంతేగా? రాష్ట్ర ప్రజలకు ఏది మంచో అదే చెబుతాను. ప్రజలు నన్ను వద్దనుకొంటే నమస్కారం పెడతాను. నేను చెప్పేది ఒకటే. సమస్యల నుంచి దూరంగా పారిపోవాల్సిన అవసరం లేదు. అవేంటో తెలుసుకోవాలి. వాటికి పరిష్కారాలపై అధ్యయనం చేయాలి. సీమాంధ్ర ప్రజల మనసుల్లో హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలు, విద్యావకాశాలు, నదీ జలాలపై భయాందోళనలున్నాయి. తమ భవిష్యత్ అంధకారంలో పడుతుందన్న భయం ఉంది. అధికారంలో ఉన్నవారు ఇటు తెలంగాణ...అటు ఆంధ్ర ప్రజలందరితో చర్చించాలి. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు అందరితో ఒకసారి కాకపోతే నాలుగుసార్లు చర్చించండి. అందరికీ విశ్వాసం కలిగేలా చేయండి. ఎవరూ విజేతలు... పరాజితులు ఉండకూడదని బుద్ధుడు చెప్పాడు.

శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో అదే పేర్కొంది. దానిని ఆచరణలో పెట్టండి. తెలంగాణలో సకల జనుల సమ్మె జరిగినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. ఇటువంటి అనిశ్చితి మంచిది కాదని అన్నాను. తెలంగాణను మూడేళ్లు తగలబెట్టారు. ఇప్పుడు సీమాంధ్రను మంటల్లోకి నెట్టారు. రాష్ట్రంలోని రాజకీయ నేతలందరిలోకి నేను సీనియర్‌ను. రాజకీయ కుట్రలు జరుగుతుంటే నేను నోరు మూసుకొని కూర్చోవాలా? నా అభిప్రాయాలు నేను చెబుతాను. ప్రజలు వారి నిర్ణయం వారు తీసుకొంటారు' అని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర తర్వాత తెలంగాణలో కూడా పర్యటిస్తానని, తనను ఎవరూ ఆపలేరని ఆయన పేర్కొన్నారు.

టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నప్పుడల్లా తమపైకి ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తుందని, ఇప్పుడూ అదే చేస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బయట మాట్లాడుతున్నవన్నీ తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా వద్ద ఎందుకు చెప్పలేదని చంద్రబాబు ప్రశ్నించారు. వినకపోతే అప్పుడే ప్రతిఘటించాల్సింది, లోపల ఒకటి...బయట ఒకటి మాట్లాడటం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. తమ సమస్యలపై పోరాడుతున్న ఎన్జీవోలను అభినందిస్తున్నానని, వాళ్లకు జరిగిన అన్యాయాన్ని చెప్పడానికే తాను వెళ్తున్నాను తప్ప తనకు ఇప్పుడు కొత్తగా కావాల్సిన రాజకీయ లబ్ధి ఏమీ లేదని చెప్పారు.