July 3, 2013

నేటి నుంచి టీడీపీ ప్రాంతీయ సదస్సులు

స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి టీడీపీ సమాయత్తం అవుతోంది. పార్టీ శ్రేణులను ఈ దిశగా సంసిద్ధం చేసే నిమిత్తం ఆ పార్టీ బుధవారం నుంచి ఐదు చోట్ల ప్రాంతీయ సదస్సులను నిర్వహిస్తోంది. మొదటి సదస్సు బుధవారం విశాఖ నగరంలో జరగనుంది. నాలుగో తేదీన విజయవాడ, ఐదో తేదీన తిరుపతి, ఆరో తేదీన హైదరాబాద్, ఏడో తేదీన వరంగల్ నగరాల్లో జరగనున్నాయి. వీటన్నింటికి చంద్రబాబు హాజరవుతారు. ఒక్కో ప్రాంతీయ సదస్సుకు నాలుగైదు జిల్లాల పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా పార్టీ శ్రేణులకు ఈ ఎన్నికల ప్రాధాన్యాన్ని వివరించడం ద్వారా మంచి ఫలితాలు వచ్చేలా చూడాలన్నది టీడీపీ వ్యూహం. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడంతోపాటు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ ప్రాంతీయ సదస్సులు పెడుతున్నామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ అన్నారు.

విశాఖ సదస్సుకు శ్రీకాకుళం, విజయనగరం,విశాఖ,తూ ర్పు గోదావరి జిల్లాల నుంచి ఇరవై వేల మంది ఈ సదస్సుకు హాజరుకానున్నారు. 4న జరిగే సదస్సుకు విజయవాడలోనిఈడుపుగల్లు వేదికకానుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 20 వేల మంది కార్యకర్తలు పాల్గొంటారని అంచనా. 5వతేదీ తిరుపతిలో జరిగే సదస్సుకు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూ రు జిల్లాల నుంచి 20 వేల మంది హజరు అవుతారు. వరంగల్‌లో ఈ నెల 7న జరిగే టీడీపీ ప్రాంతీయ సభ నిర్వహణకు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి 25 వేల మందికిపైగా పార్టీ ప్రతినిధులు హాజరవుతారని ఎర్రబెల్లి చెప్పారు.