July 13, 2013

ఆహార భద్రత ఎన్టీఆర్ ఆలోచన: హరికృష్ణ

పేదలకు ఆహార భద్రత కల్పించాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీ రామారావుదేనని, కాంగ్రెస్ పార్టీ దానిని కాపీ కొట్టి ఇప్పుడు హడావుడి చేస్తోందని టిడిపి ఎంపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఇక్కడ 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడారు. 'పేదలకు ఆహార భద్రత కల్పించడం కోసం ఎన్టీ రామారావు 1982లోనే రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం ప్రవేశపెట్టారు. అంతకు ముందు మూడున్నర దశాబ్దాలపాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఆలోచన ఎన్నడూ రాలేదు.

ఎన్టీ రామారావు నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలోని పేదలకు కాస్తంత ఆసరా దొరికింది. ఈ పధకాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టి దేశంలోని పేదలందరికీ ఆహార భద్రత కల్పించాలని 1987లో జరిగిన ముఖ్యమంత్రుల సదస్సులో ఎన్టీ రామారావు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కాని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పెడచెవిన పెట్టింది' అని ఆయన విమర్శించారు.

ఎన్టీఆర్ ఆలోచనను అందుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి పాతికేళ్ళు పట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. 'పేదలకు ఆహార భద్రత గురించి దేశంలో తామే మొదటిసారి ఆలోచన చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రచారార్భాటం చేస్తోంది. ఆ పార్టీ కంటే పాతికేళ్ళ ముందే ఎన్టీ రామారావు దీనిపై ఆలోచన చేశారు. అమలు చేశారు. కాంగ్రెస్‌తో పోలిస్తే టిడిపిది ఎంత ముందు చూపో ఇదే నిదర్శనం. ఎన్టీఆర్ ఇచ్చిన సలహాను పాతికేళ్ళపాటు నిర్లక్ష్యం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ముందు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ప్రజల ముందుకు వస్తే బాగుంటుంది' అని ఆయన వ్యాఖ్యానించారు.