July 13, 2013

టీ పై తమ్ముళ్లు దూకుడు పెంచుతారా?

ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ కోర్‌ కమిటీ తెలంగాణపై శుక్రవారం నాడు చేసిన ప్రకటనపై టీ టీడీపీ నేతల స్పందన ఇది. ఈ రెండు వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే.. టీ టీడీపీ తమ్ముళ్లు కూడా తెలంగాణపై ఇక ఉద్యమాన్ని తీవ్రతరం చేసే ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ సర్కారుదేనంటూ టీడీపీ ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఆదిశగా పార్టీ నేతలతోనూ తెలుగు తమ్ముళ్లు సమాలోచనలు చేయవచ్చంటున్నారు.
తెలంగాణపై టీడీపీ వైఖరి స్పష్టం

రాష్ట్ర విభజనపై ఇన్నాళ్లూ ఊగిస లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ధైర్యం చేసి మరో అడుగు ముందుకు వేశారంటున్నారు. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అంటూ తాము తెలుగు బిడ్డలను విడదీసి చూడలేమని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అధినేత చంద్రబాబు నాయుడు కూడా తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్ల వంటి వని, ఏ కన్ను ఎక్కువ? ఏదితక్కువ అంటే ఏం చెబుతామని రెండు కళ్ల సిద్ధాంతం వల్లే వేయడంతో తెలంగాణలో తెలుగు తమ్ముళ్లకు టీఆర్‌ఎస్‌ లాంటి పార్టీల నుండి కొంత ఇబ్బందులు తప్పలేదు. అసలు టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చే అవకాశం ఉన్న కాంగ్రెస్‌ను వదిలేసి కేవలం తెలుగుదేశం పార్టీనే టార్గెట్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ అధిగమించింది తెలుగుదేశం పార్టీనే అన్నది వాస్తవం.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజనపై ఢిల్లీలో అఖిలపక్షం నిర్వహించిన సందర్భంగా కేంద్ర హోం మంత్రి సుషీల్‌ కుమార్‌ షిండేకే కుండ బద్దలు కొట్టినంత స్పష్టంగా లేఖ రూపంలో తమ అభిప్రాయాలనుచెప్పారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, కేంద్రం నిర్ణయం తీసుకోవాలని దీనిపై తాము చెప్పాల్సింది చెప్పామని చంద్రబాబు నాయుడు సైతం పలు సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచ్చారు. మహానాడు రాజకీయ తీర్మానం, టీడీపీ ప్రాంతీయ సదస్సులు, ఢిల్లి అఖిలపక్షం.. ఇలా పలు వేదికలపైనా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడాన్ని తెలుగు తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు.

టీ టీడీపీని జాక్‌లోకి తీసుకోవాలని ఒత్తిళ్లు

అవసరమైతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న దృష్ట్యా ఆ పార్టీని తెలంగాణ రాజకీయ జేఏసీలోకి తీసుకోవాలన్న ఒత్తిళ్లు వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌తో పాటు తాజాగా టీడీపీ కూడా జాక్‌లో చేరితే ఇక కాంగ్రెస్‌ లక్ష్యంగానే జాక్‌ కార్యాచరణ ఉంటుందని టీ టీడీపీ నేత ఒకరు ‘మేజర్‌న్యూస్‌’తో అన్నారు.

తెలంగాణ ఇస్తారో.. ఇవ్వరో చెప్పాలి

‘‘తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తోం ది. విషయాన్ని నానుస్తూ.. అంతలోనే తే ల్చేస్తామంటూ నాటకాలాడుతూ ప్రజల ను ఆందోళనకు గురిచేయడం తప్ప చేసిందేమీలేదు. తెలంగాణ ఇస్తారా? ఇవ్వరా? చెప్పాలి. 2004 నుంచి ఈ అంశాన్ని నానుస్తున్నారు, తక్షణం తెలం గాణ ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలి.’’
- ఎర్రబెల్లి దయాకరరావు, టీ టీడీపీ ఫోరం కన్వీనర్‌.

తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే యత్నం

‘‘కాంగ్రెస్‌ పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలోనే తెలంగాణ కు అనుకూలమైన నిర్ణయం తీసుకుని, తర్వాత ఆ పార్టీ వ ర్కింగ్‌ కమిటీకి నివేదించుకుని ఉండొ చ్చు కదా? కాంగ్రెస్‌ వ్యవహారాన్ని ప్ర జలు నిశితంగా గమనిస్తున్నారు. కాంగ్రెస్‌ మరోసారి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది’’.
-మోత్కుపల్లి నర్సింలు, టీ టీడీపీ సీనియర్‌ నేత