May 24, 2013

ఊడుతున్న కొలువుల మాటేమిటి?: మోత్కుపల్లి



  కొత్త ఉద్యోగాల మాట అటుంచితే... విద్యుత్ కోత కారణంగా పరిశ్రమలు మూతపడి కార్మికులు, ఉద్యోగులు వీధిన పడే దుస్థితి నెలకొందని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. రాజీవ్ యువకిరణాల ద్వారా 15 లక్షల మందికి మూడేళ్లలో ఉద్యోగాలు రానున్నాయని సీఎం ప్రకటించడాన్ని ఆయన ప్రస్తావించారు. దేశంలో నిరుద్యోగం 6-10 శాతానికి పెరగగా, రాష్ట్రంలో 9-11 శాతానికి పెరిగిం దన్నారు.
ఇప్పటి వరకు రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇక నుంచి విద్యుత్ కోతతో పరిశ్రమల మూత కారణంగా చిన్న పరిశ్రమల యజమా నులు, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి నెలకొందన్నారు. విద్యుత్ కోతలతో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యుత్ శాఖకు మంత్రిని నియమించలేదని, విద్యుత్ సంక్షోభం రోజురోజుకూ ముదురుతున్నా పట్టించుకునే నాథుడే లేరన్నారు. కోత కారణంగా చికిత్సలు అందక... ఆస్పత్రుల్లో చిన్నారులు కూడా మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై కార్యాచరణను ప్రకటించాలని, పరిశ్రమలు మూతపడకుండా చర్యలు తీసుకోవాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.