May 9, 2013

యడ్డి, గాలి పార్టీల్లా జగన్ పార్టీదీ అదే గతి: టీడీపీ

హైదరాబాద్ : అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన యడ్యూరప్ప, గాలి జనార్దనరెడ్డి పార్టీలకు కర్ణాటక ఎన్నికల్లో పట్టిన గతే ఇక్కడ జగన్ పార్టీకి తప్పదని టీడీపీ వ్యాఖ్యానించింది. బుధవారం కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ఉపాధ్యక్షుడు ఇ.పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన యడ్యూరప్ప కొత్త పార్టీ పెట్టినా ప్రజల కళ్లుగప్పలేకపోయారని రామకృష్ణుడు పేర్కొన్నారు. ఇక వేల కోట్ల విలువైన ఇనుప ఖనిజం గనులను గాలి జనార్దనరెడ్డికి దోచిపెట్టిన బీజేపీతోపాటు ఆయన సన్నిహితుడు పెట్టిన బీఎస్సార్ కాంగ్రెస్‌కు, ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.

రాష్ట్రంలో వైసీపీకి యడ్యూరప్ప పార్టీతో సారూప్యం ఉందని, వచ్చే ఎన్నికల్లో ఈ అవినీతిపరులకు తెలుగు ప్రజలు కూడా బుద్ధిచెప్పి, టీడీపీని గెలిపిస్తారని విశ్వాసం వెలిబుచ్చారు. అధికార దుర్వినియోగం, క్రమశిక్షణరాహిత్యాన్ని సహించబోమని కర్ణాటక ప్రజలు స్పష్టం చేశారని పెద్దిరెడ్డి అన్నారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ సంబరపడాల్సినవి కావని, అవినీతిపై అక్కడి ప్రజలిచ్చిన తీర్పు యూపీఏ కుంభకోణాల పాలనపైనా పునరావృతం అవుతుందని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ అనుకూల ఓటు కాదు: జేపీ
కర్ణాటక ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయడాన్ని జాతీయస్థాయిలో కాంగ్రెస్ పాలనపై తీర్పుగా భావించరాదని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ సర్కారు అవినీతి, అసమర్థ పాలన, కీలకరంగాల్లో ఘోర వైఫల్యం, అనైక్యతే కాంగ్రెస్‌కు లాభించినట్లు స్పష్టం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కన్నా అధికస్థాయిలో కర్ణాటక ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు సగటున తలా రూ.15-20 కోట్లు వెదజల్లారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, తొలి ప్రయత్నంలో భాగంగా 24 స్థానాల్లో పోటీచేసిన తమ పార్టీకి బెంగళూరు నగరంలో ప్రోత్సాహకర స్పందన లభించిందని లోక్‌సత్తా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కటారి శ్రీనివాసులు అన్నారు. కాగా, కర్ణాటక తరహాలోనే మన రాష్ట్రంలోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజా తీర్పు వస్తుందని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నరసింహా రెడ్డి అభిప్రాయపడ్డారు.

భయంతోనే కిరణ్ బెల్ట్ షాపుల రద్దు ప్రకటన: టీడీపీ నేత అనురాధ
టీడీపీ అధికారంలోకి రాగానే బెల్టు షాపుల రద్దుపై రెండో సంతకం పెడతానన్న చంద్రబాబు హామీపై మహిళలు హర్షం ప్రకటించడంతో సీఎం కిరణ్ భయపడ్డారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధ వ్యాఖ్యానించారు. ఆ భయంతోనే హడావుడిగా ప్రభుత్వం బెల్టు షాపుల రద్దు ప్రకటన చేసిందని బుధవారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు.

అనుమతి లేని మద్యం దుకాణాల మూసివేతకు, మద్యం అక్రమ విక్రయాల అదుపునకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై నివేదిక ఇవ్వాలని 2009లో ఏప్రిల్ 1న హై కోర్టు ఆదేశించినా, నాటి సీఎం వైఎస్ స్పందించలేదని విమర్శించారు. బెల్టు షాపుల రద్దు మాత్రమే కాకుండా, విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలపైనా నియంత్రణ విధించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.