May 5, 2013

చంద్రబాబుకు అందని ఆహ్వానం! ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పిలవని స్పీకర్

కార్యలయం
రేపు స్పీకర్‌ను కలవనున్న టీడీపీ ఎంపీలు

హైదరాబాద్ : పార్లమెంటు ఆవరణలో మంగళవారం తలపెట్టిన ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి ఆహ్వానం అందలేదు. స్పీకర్ కార్యాలయంతోపాటు వ్యక్తిగతంగా కేంద్ర మంత్రి పురందేశ్వరి కూడా ఆయనను ఆహ్వానించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ తనకు ఏ ఆహ్వానం అందలేదని తన నివాసంలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయన స్వయంగా చెప్పారు. "పార్లమెంటు ఆవరణలో ఇక కేవలం రెండు విగ్రహాల ఏర్పాటునకు స్థలం ఉందని తెలిసి.. మన పార్టీ ఎంతగానో కృషి చేసింది.

అప్పట్లో పార్లమెంటు కమిటీలో సభ్యునిగా ఉన్న ఎర్రన్నాయుడు.. ఆ స్థలంలో ఎన్టీఆర్, అల్లూరి విగ్రహాలను పెట్టాలని ప్రతిపాదించగా, దివంగత స్పీకర్ బాలయోగి ఆమోదం తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం ఇవ్వాలని లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి అధికారికంగా పార్టీకి లేఖ అందింది. విగ్రహాల తయారీకి ఆర్డర్ ఇచ్చి.. అవి పూర్తయ్యే సమయానికి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. పురందేశ్వరి కేంద్ర మంత్రి అయ్యారు. విగ్రహం ఏర్పాటుకు తనకు వ్యక్తిగతంగా అనుమతి ఇవ్వాలని ఆమె పేచీ పెట్టారు. ఏకపక్షంగా వ్యవహరించిన లోక్‌సభ స్పీకర్..ఆమెకు వ్యక్తిగతంగా అనుమతి ఇచ్చారు'' అని పేర్కొన్నారు. ఆహ్వానం లేనప్పుడు పాల్గొనాల్సిన అవసరం లేదని నేతలు అభిప్రాయపడ్డారు.

కాగా, స్పీకర్‌ను సోమవారం కలిసి దీనిపై గట్టిగా ప్రశ్నించాలని పార్టీ ఎంపీలు నిర్ణయించారు. "విగ్రహావిష్కరణను ప్రతిపాదించినది మా పార్టీ. ఇపుడు అదేదో వ్యక్తిగత కార్యక్రమం అయినట్లుగా పురందేశ్వరి వ్యవహరిస్తున్నారు. తానే అందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు. ఇదేం పద్ధతి..? లోక్‌సభ స్పీకర్‌గా మీరానే కార్యక్రమం నిర్వహించాలి.. ఆమే ఆహ్వానాలు పంపాలి. ఎన్టీఆర్‌కు రాజకీయ వారసులుగా మమ్మల్ని ఆహ్వానించాలి. అలా ఎందుకు జరగలేదో స్పీకరును కలిసి అడుగుతాం. ఆమె స్పందనను బట్టి మా తదుపరి కార్యాచరణ ఉంటుంది.'' అని ఒక టీడీపీ ఎంపీ చెప్పారు.