May 6, 2013

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై సమసిన వివాదం ఢిల్లీకి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించిన స్పీకర్ మీరా కుమార్

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకపపై వివాదం సమసిపోయింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ సోమవారం ఫోన్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు రావల్సిందిగా ఆమె ఆహ్వానించారు. దీంతో బాబు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం (7వతేదీ) ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగనున్న విషయం తెలిసిందే.

చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందకపోవడంపై టీడీపీ ఎంపీలు స్పీకర్ మీరాకుమార్‌ను సోమవారం ఉదయం కలిసి మాట్లాడారు. అనంతరం నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ బాబుకు ఆహ్వానం పంపకపోవడంపై తాము తీవ్ర మనస్తాపం చెందామని, ఈ విషయాన్ని స్పీకర్ వద్దకు తీసుకు వెళ్ళామని అన్నారు.

కేంద్ర మంత్రి పురందేశ్వరి ఆహ్వాన లేఖను చంద్రబాబుకు నివాసానికి పంపించారని, దానిని వారు తిరస్కరించారని, తర్వాత టీబీపీ భవన్‌కు పంపినట్లు ఆమె చెప్పారని స్పీకర్ తెలిపినట్లు నామా చెప్పారు. అలాంటిదేమి జరగలేదని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు దివంగత ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తనకు విగ్రహావిష్కరణకు ఆహ్వానం రాకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ దేశరాజధాని పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం తనకు సంతోషంగా, ఎంతో గర్వంగా ఉందన్నారు. తన భర్త ఎన్టీఆర్ చివరి రోజుల్లో తిండి కూడా పెట్టని పురంధరేశ్వరి నేడు ఎక్కడ లేని ప్రేమను చూపిస్తూ ఆయన ఇమేజ్‌ను వాడుకుని పదవులు అనుభవిస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆమెపై ఘాటైన ఆరోపణలు చేశారు.

చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచే ధైర్యం లేదని, ఆయన వెనుక పురంధేశ్వరి హస్తం ఉందని లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఆఖరు సమయంలో ఎన్టీఆర్ క్షోభకు పురంధేశ్వరే కారణమని ఆమె మండిపడ్డారు.