May 6, 2013

పనిలో వేగం.. మనుషులంటే ఎన్టీఆర్‌కు అభిమానం

ఆ మనిషి.. అపురూపం
మా బాగోగులన్నీ ఆ మహానుభావుడే చూసుకున్నారు
డ్రెవర్ అని ఎవరైనా అంటే ఊరుకునేవారు కారు
ఎన్టీఆర్‌తో అనుబంధాన్ని పంచుకున్న సహచరులు

ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తుదిశ్వాస విడిచేవరకు వారు ఆయన వెన్నంటే ఉన్నారు. ఒకరు ఆయన డ్రైవర్, మరొకరు వ్యక్తిగత సహాయకుడు.. ఇంకొకరు భద్రతా సహాయ అధికారి. ఎన్టీఆర్ భావావేశాన్ని, ఆగ్రహాన్ని, ఆప్యాయతను, పరిపాలన దక్షతనూ అత్యంత సన్నిహితంగా గమనించారు వాళ్లు. అలాగే ఎన్టీఆర్ వద్ద సుదీర్ఘకాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ మరొకరు.

మంగళవారం పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భం గా 'ఆంధ్రజ్యోతి' వాళ్లను పలకరించింది. 'ఎన్టీఆర్ గారు' అని సంబోధించేందుకూ నేటిదాకా సాహసించని వీళ్లు ఆ 'మహానుభావుని'తో తమ అనుబంధాన్ని 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి'తో పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే...

కుర్రాళ్లం కాబట్టి వేగాన్ని తట్టుకున్నాం: మోహన్‌రావు, పీఏ
ఆయన అధికారంలోకి వచ్చినరోజు నుంచి చనిపోయేవరకు ఆయన సేవలో ఉన్నా. టెలిఫోన్ ఆపరేటర్ నుంచి ముఖ్యమంత్రికి పీఏ అయ్యాను. అన్నేళ్లలో ఒక్క రోజూ బాధపడాల్సి రాలేదు. ఏ పనైనా చెప్పినపుడు..'నేను చేయలేనేమో సార్' అంటే 'రండి చేద్దాం' అంటూ దగ్గరుండి చేయించేవారు. ఏదైనా పని మీద మా ఇంటికి ఆయన ఫోన్ చేస్తే 'నమస్కారం' అని పలకరించేవారు. సమయపాలన విషయంలో కచ్చితంగా ఉండేవారు.

ఆ రోజుల్లో మేం కుర్రాళ్లం కాబట్టి ఆయన వేగాన్ని తట్టుకోగలిగాం. ఉరుకులు పరుగుల మీద అన్నట్లుగా ఉండేది మా పని. ఒకసారి ఓ యూనివర్సిటీ నుంచి ఓ ప్రొఫెసర్ వచ్చారు. అప్పుడాయన (ఎన్టీఆర్) నిద్రలో ఉన్నారు. ఆ విషయం ప్రొఫెసర్‌కి చెప్పి వెయిట్ చేయమంటే కోపంగా వెళ్లిపోయి మామీద ఫిర్యాదు చేస్తూ సార్‌కి ఉత్తరం రాశారు. దానికి ఆయన ప్రొఫెసర్‌ని విమానంలో పిలిపించుకొని.. 'వీళ్లు పగలూ, రాత్రీ నా దగ్గర పని చేస్తారు. వీళ్ల గురించి నాకు తెలుసు. మీరు చిలువలు పలువలు చేస్తూ ఉత్తరం రాయడం బాగాలేదు' అని మందలించారు. అలా నమ్మేవారాయన మమ్మల్ని.

ఇంకెవరైనా వేస్టే కృష్ణారావు, భద్రతాధికారి
"నటునిగా ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం ఆయన దగ్గర పనిచేశాక ఎన్నో రెట్లు ఎక్కువైంది. 1962లో గులేబకావళి సినిమా షూటింగ్ సమయంలో చెన్నై వెళ్లి కలిసినపుడు వాహినీస్టూడియో చూసే అవకాశం కల్పించారు. కుప్పం ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు చెన్నై వెళ్లాం. ఉదయమే కుప్పం వెళ్లాలి. రాత్రి నేను గెస్ట్‌హౌజ్‌లోని సోఫాలోనే నిద్రలోకి జారుకున్నాను. లేచి చూసేటప్పటికి నాపై ఎర్రని శాలువా కప్పి ఉంది. ఉలిక్కిపడి లేచాను. అది సార్ శాలువా. అప్పడే ఆయన వచ్చారు. "సార్ ఇది మీ శాలువా'' అన్నాను. "ఏం ఫరవాలేదు. మీరు మంచి నిద్రలో ఉన్నారు.

చలికి ఇబ్బంది పడుతున్నారు. నేనే కప్పాను. అది మీ దగ్గరే ఉంచుకోండి'' అన్నారు. సమావేశాల్లో జనాన్ని అదుపుచేయడం మాకు కష్టమైతే ఆయన గమనించి తన కంటి చూపుతో, మాటలతో నియంత్రించేవారు. ఏ పొరపాటు చేసినా తిట్టేవారు కాదు. మా కుటుంబ సభ్యులు ఆయన్ను చూడడానికి వస్తే అక్కడున్న అందరినీ బయటకు పంపి మాట్లాడేవారు. ఎవరొచ్చారని ఎవరైనా అడిగితే.. 'మా అమ్మాయి వచ్చింది' అనేవారు. ఆయన్ని చూసిన తర్వాత ఇంకే నాయకుణ్ని చూసినా వేస్టేననిపిస్తుంది.''

ఆ రాముడికి లచ్చన్న నేనే: లక్ష్మణ్, డ్రైవర్
"నేను నా సర్వీసు కాలంలో ఐదుగురు సీఎంల దగ్గర పని చేశాను. కానీ నాకు ఈరోజు ఉన్న గుర్తింపు ఆ మహానుభావుని డ్రైవర్‌గానే. లచ్చన్నా.. అని నోరారా పిలిచేవారు. 14 ఏళ్లలో ఒక్కసారయినా 'అరేయ్' అని పిలుస్తాడేమోననుకున్నా. కానీ 'డ్రైవర్' అని కూడా పిలవలేదు. ఒకసారి నేను పక్కకువెళ్లి, రావడం కొన్ని సెకన్లు ఆలస్యమైంది. జయబాబు (ఎన్టీఆర్ కుమారుడు జయకృష్ణ) 'డ్రైవర్ ఏడీ' అన్నారు. అది విన్న 'సారు'.. 'లచ్చన్నా అనలేరా?' అని మందలించారు.

ఆయన అధికారంలో లేని సమయంలో ప్రభుత్వోద్యోగానికి సెలవుపెట్టి ఆయనకు వ్యక్తిగత డ్రైవర్‌గా వెళ్లాను. సార్ మళ్లీ అధికారంలోకి వచ్చాక.. నేను మానేసిన కాలాన్ని రెగ్యులరైజ్ చేయించడంతోపాటు నాలుగు ఇంక్రిమెంట్లు ఇప్పించారు. నాకే ఇబ్బందిరాకుండా ఓ సర్వీసు ఫైల్ కాపీ ఇప్పించారు. "మేం లేకున్నా లచ్చన్న ఇబ్బంది పడకూడదు'' అన్నారాయన. ఆ రామునికి లచ్చన్నలాగా ఉండేవాణ్ని. ఓసారి మేం నాచారం స్టూడియోకి వెళ్లేటప్పుడు పెద్దమ్మ (బసవ తారకం) 'రామన్న, లచ్చన్న.. బాగున్నారు జోడీ..' అన్నారు. అది విని సారు నవ్వేశారు.

ఆయన ఓడిపోయిన తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తే సత్యనారాయణ వ్రతం చేస్తానని మా ఆవిడ మొక్కుకుంది. ఆయన గెలిచారు. సార్‌కి విషయం చెప్పాను. వ్రతానికి వస్తానన్నారు. వచ్చినపుడు మీ పళ్లెం తెచ్చుకోవాలని చెప్పాను. ఆయన ఎప్పుడూ వెండి పళ్లెంలో తినేవారు. ఆయన భోజనానికి వచ్చినపుడు ఒకరు ఎక్కువ వచ్చారు. 'లచ్చన్నా ఒకరు ఎక్కువ వచ్చారు ఫరవాలేదా?' అన్నారు. ఆ రోజు నాకు బట్టలు పెట్టారు. వాటిని నేను ఇంతవరకు కుట్టించుకోలేదు.

బీరువాలో భద్రంగా ఉన్నాయి. నేను చచ్చినపుడు వాటిని నా శవంమీద కప్పాలని నా కోరిక. ఓ రోజు మేం నాచారం నుంచి ఆబిడ్స్ ఇంటికి వచ్చాం. రాగానే ఆయన నా భుజం మీద చేయి వేసి..'లచ్చన్నా ఇంటికి వెళ్లండి'' అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. అక్కడే ఉన్న సిబ్బంది నన్ను పిలిచి మీ నాన్న చనిపోయారని చెప్పారు. ఆయనకు ట్యాంక్‌బండ్ మీద విగ్రహాలంటే ఎంతో ప్రాణం. ఓసారి ఆయన్ను ఎయిర్‌పోర్ట్‌లో దించేందుకు వెళ్తున్నా.

ట్యాంక్‌బండ్ మీద 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నా. సార్ ఒక్కసారిగా..'లచ్చన్నా ఆపండి' అన్నారు. నేను సడెన్ బ్రేక్ వేశాను. 'వెనక్కి తీసుకోండి' అన్నారు. రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద ఆపమన్నారు. కాన్వాయ్ వెంట ఉన్న ఒక అధికారిని పిలిచి.."ఆ గుర్రానికి ఉన్నవి కాళ్లా, కర్ర పుల్లలా'' అని అడిగి అక్కడే ఒక కాగితం మీద ఓ నమూనా గీసి.. "నేను మద్రాస్ నుంచి వచ్చేలోపు ఇలా చెక్కించండి'' అని ఆదేశించారు. ఆయన పరిశీలన అంత జాగ్రత్తగా ఉండేది.

ఆ ముందు రోజు.. 'పోండి' అన్నారు
ఆరోజు నాకింకా బాగా గుర్తుంది. 1996 జనవరి 17న సాయంత్రం నన్ను పిలిపించారు. నేను వెళ్లినప్పుడు డెంటిస్టులు నారాయణ, సైఫుల్లాబేగ్ ఆయన పళ్లకు ఏదో చికిత్స చేశారు. నన్ను చూడగానే రమ్మని సైగ చేశారు. "ఒకటో తారీఖు నుంచి మనం ప్రజల్లోకి వెళ్లాలి. చైతన్యరథం సిద్ధం చేయండి. ఏమైనా సమస్యలున్నాయా'' అని అడిగారు.

'బ్యాటరీలు చెక్ చేయాలి సార్'' అన్నారు. "చేయించండి. ఇక పోండి'' అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. అన్నేళ్లలో ఆయన ఎప్పుడూ అలా అనలేదు. దాంతో నా మనసు కలత చెందింది. ఓ గంటసేపు అక్కడే ఉండిపోయాను. ఉదయం నాలుగింటికే 'కబురు' వచ్చింది. ఇప్పుడు ఆయన లేకున్నా జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. అందుకే అపుడపుడు 'ఘాట్'కి ఆయనకెంతో ఇష్టమైన సంపంగి పూలు తీసుకెళ్లి, నివాళి అర్పిస్తాను. ఇన్నేళ్లకైనా సార్ విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టడం సంతోషంగా ఉంది.

కోపం వస్తే సార్ అనేవారు: లక్ష్మీ నారాయణ, విశ్రాంత ఐఏఎస్
"ఏ సమస్య వచ్చినా ప్రజలు నాతో ఉన్నారు, నన్ను నమ్ముతారనే అచంచల విశ్వాసంతో ఉండేవారు ఎన్టీయార్. ఆయన ఆత్మవిశ్వాసం చూస్తే ఒక్కోసారి మాకే ఆశ్చర్యం వేసేది. ఎలాంటి సమస్య వచ్చినా నిబ్బరంగా ఉండేవారు. పేద ప్రజలకు ఏమన్నా చేయాలనే తపన కనిపించేది. అందుకే కూడు, గూడు, నీడ అనే నినాదాలతో రెండు రూపాయల బియ్యం, జనతా వస్త్రాలు, కాంక్రీట్ ఇళ్లు ఇచ్చే పనిపెట్టుకున్నారు.

ఇవే నేటికీ ప్రజల హృదయాల్లో ఆయన నిలిచిపోవడానికి కారణం. మేం ఆయన ఇంట్లో ఉదయం 4 గంటలకే వాలిపోయేవాళ్లం. ఇల్లంతా సాంబ్రాణి ఘుమఘుమలతో పవిత్రంగా ఉండేది. సాయంత్రం 7 గంటల వరకు ఆయనతో పనిచేసి.. మరో రెండు గంటల్లో మా పని పూర్తి చేసుకొని ఇళ్లకు పోయేవాళ్లం. అయినా శ్రమ తెలిసేది కాదు. ఆయనకు కోపం వస్తే మరింత గౌరవం పెంచేసి 'సార్' అనే వారు. అదే మాకు ఓ హెచ్చరిక.

మరీ కోపం వస్తే "ఏమండీ గుడ్డిగుర్రం పళ్లు తోముతున్నారా?'' అనేవారు. పని విషయంలో ఎంతో కచ్చితంగా ఉండే ఆయన వ్యక్తిగతంగా సిబ్బందితో అంతే ఆప్యాయంగా ఉండేవారు. యోగక్షేమాలు, భోజనాది విషయాలు మరువకుండా కనుక్కునేవారు. ఏవైనా విధాన నిర్ణయాలు తీసుకునేటపుడు ఇబ్బందులు చెబితే "ఏం పిరికిమందు పోస్తున్నారా మాకు?'' అనేవారు. పేదల కోసం పని చేసేటపుడు సాహస నిర్ణయాలు తీసుకోవాలనేవారు.