December 1, 2012

సమస్యలను పరిష్కరిస్తా!

            

'మీకోసం వస్తున్నా' పాదయాత్ర మొత్తం 117 రోజులు! నేటికి దాదాపు సగం రోజులు పూర్తయ్యాయి! ఈ రెండు నెలల్లో ఎన్నో అనుభవాలు! ఎందరివో కష్టాలను కళ్లారా చూశాను. యాత్ర మొదలుపెట్టిన దగ్గర్నుంచి నేను కూడా వ్యక్తిగతంగా, ఆరోగ్యపరంగా రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నా. అనంతపురంలోనే మడమ దగ్గర సమస్య! గద్వాలలో వేదిక కూలి ఇబ్బంది! ఎడమ కాలి చిటికెన వేలు సలిపేస్తోంది. ఇటీవలే షుగర్ కూడా వచ్చింది. ఇబ్బందిగానే ఉన్నా ప్రజలతో మమేకమవుతూ వాటిని మర్చిపోతున్నా!

నేను కూడా చిన్నప్పటి నుంచీ ఎన్నో కష్టాలు పడి ఉన్నత స్థానానికి వచ్చాను. క్రమశిక్షణను, కష్టాన్నే నమ్ముకున్నాను. ప్రజాసేవలో ఉన్నప్పుడు పది మందికీ ఆదర్శంగా ఉండాలని అనుకుంటాను. ఏదైనా అనుకుంటే దానిని సాధించే వరకు పోరాడే తత్వం నాది. ఇప్పుడు కూడా రకరకాల ప్రలోభాలు, విమర్శలూ వస్తున్నాయి. వాటిని అధిగమించి ముందుకు సాగుతున్నా!!

తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా! తొమ్మిదేళ్లుగా ప్రతిపక్ష నేతను! పదేళ్ల తర్వాత కూడా ప్రజలు నా పాలనను గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో రోడ్లు బాగున్నాయి. విద్యుత్తు సరఫరా బాగుండేది. వరుస కరువుల్లోనూ మంచి పాలన అందించారని నాతోనే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టి నమ్మక ద్రోహం చేసిందని మండిపడుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, వారికి అండగా నిలవాలనే ఎంతమంది వద్దని వారించినా సొంతంగా నిర్ణయం తీసుకుని పాదయాత్రకు బయలుదేరాను. క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు! కష్టాలు.. కన్నీళ్లు! అన్నిటినీ సావధానంగా వింటూ.. నా అనుభవాన్ని జోడించి వాటిని ఎలా పరిష్కరించాలని ఆలోచన చేస్తూనే ముందుకు కదులుతున్నా!