December 1, 2012

గులాబీ ఇలాకాలో పసుపు పతాక


బాన్సువాడలో చంద్రబాబుకు బ్రహ్మరథం

నిజామాబాద్, నవంబర్ 30 (ఆంధ్రజ్యోతి) : టీఆర్ఎస్ ఇలాకాలో శుక్రవారం బాబుకు బ్రహ్మరథం పట్టారు. ఆయన పాదయాత్రకూ, సభలకూ జనం నుంచి అనూహ్య స్పందన వెల్లివిరిసింది. వేల సంఖ్యలో గిరిజన మహిళలు చంద్రబాబు వెంట నడిచారు. అన్ని వర్గాల ప్రజలు కూడా బాబుకు మద్దతు ప్రకటించడం కనిపించింది. అనేక చోట్ల ప్రజలు కూడా తరలివచ్చి తమ సమస్యలను చెప్పుకొన్నారు.

చంద్రబాబు ప్రసంగానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా రుణ మాఫీ చేస్తామనే హామీ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. యాత్ర ఆసాంతం బీసీలు దన్నుగా నిలిచారు. బాబు చెప్పిన ప్రతీ మాటను చప్పట్లతో స్వాగతించారు. ఈ క్రమంలో ఎక్కడా చిన్న నిరసన స్వరం సైతం వినిపించకపోవడం పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచింది.

వాస్తవానికి 2009ఎన్నికల్లో ఈ స్థానాన్ని టీడీపీయే గెలుచుకుంది. తెలంగాణ వాదం నేపథ్యంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి 2011, అక్టోబర్‌లో టీఆర్ఎస్‌లో చేరి.. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున గెలిచారు. స్థానిక వ్యతిరేకత కారణంగా ఆసమయంలో టీడీపీ తన అభ్యర్థిని కూడా పెట్టలేకపోయింది. పార్టీ ఎమ్మెల్యేలు కనీసం నియోజకవర్గంలో పర్యటించలేకపోయారు.

కాగా, చంద్రబాబు పాదయాత్రను అడ్డుకొనే విషయమై స్థానిక ఎమ్మెల్యే పోచారం పెద్ద ఆసక్తి చూపలేదని సమాచారం. చంద్రబాబు కూడా పోచారంపై విమర్శలు చేయకపోవడం ఒక విశేషమైతే.. కేసీఆర్‌పై మరింతగా చెలరేగి చంద్రబాబు విమర్శలు చేయడం మరో విశేషం.