December 9, 2012

తప్పు చేస్తే శిక్ష తప్పుదు

ఒక ఎంపినో, ఎమ్మెల్యేనో పోయినా ఫరవాలేదు
మా ఎంపీలు చేసిన పని బాధ కలిగించింది
విలువలే నాకు ముఖ్యం.. వాళ్లు పశ్చాత్తాపం చెందుతున్నారు
ప్రలోభాలకు లొంగినట్లు తేలితే క్షమించబోను
ఆదిలాబాద్ పాదయాత్రలో చంద్రబాబు
ఆ పార్టీలకు మమ్మల్ని విమర్శించే హక్కు ఎక్కడుంది
ఓ పార్టీ ప్రణబ్‌కు ఓటేసింది
టీఆర్ఎస్ ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలను అమ్ముకుంది
1100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న టీడీపీ అధినేత
పత్తి రైతు కోసం ఒక రోజు దీక్షకు నిర్ణయం

ఆదిలాబాద్, డిసెంబర్ 9 : చిల్లర వర్తకులను నట్టేట ముంచే ఎఫ్‌డీఐలకు టీడీపీ వ్యతిరేకమని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై జరిగిన ఓటింగ్‌లో తమ పార్టీ ఎంపీలు తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదని తెగేసి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం ఆర్లి క్రాస్ రోడ్ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. కుంటాల క్రాస్్‌రోడ్, నందన్ క్రాస్‌రోడ్, నర్సాపూర్ (జి) క్రాస్‌రోడ్, చర్లపల్లి వరకు 11.5 కిలోమీటర్లు నడిచి 1100 కిలోమీటర్లు పూర్తి చేశారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి రాజీనామా నేపథ్యంలో ఎఫ్‌డీఐలపై ఓటింగ్ అంశాన్ని పలు సభల్లో చంద్రబాబు ప్రముఖంగా ప్రస్తావించారు.

"ఎఫ్‌డీఐలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. మొన్న రాజ్యసభలో ఓటింగ్ జరిగిన సమయంలో మా పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు హాజరు కాలేకపోయారు. నేను ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఇప్పటికే 1100 కిలోమీటర్లకు పైగా నడిచాను. ఈ సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం నాకు తీవ్రమైన బాధ కలిగించింది. అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోయానని దేవేందర్ గౌడ్ ముందే చెప్పారు. మిగతా ఇద్దరూ (సుజనా చౌదరి, గుండు సుధారాణి) లిఖితపూర్వకంగా జరిగినదాన్ని నాకు వివరించారు. తప్పు చేశామంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. నాకూ, పార్టీ కార్యకర్తలకూ క్షమాపణ చెప్పారు.

నేను ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాను. ప్రలోభాలకు లోనయినట్టు తేలితే ఎవరినైనా క్షమించేది లేదు. అదే సమయంలో తెలియక పొరపాటు జరిగి ఉంటే శిక్షించడం కూడా సరికాదు. ఒక ఎంపియో ఎమ్మెల్యేనో పోయినా ఫరవాలేదు. విలువలతో కూడిన రాజకీయం చేస్తా'' అని స్పష్టం చేశారు. ఈ అంశంలో తమపై విమర్శలు చేస్తున్న ఇతర పార్టీలకు దీటైన సమాధానం ఇచ్చారు. " రాష్ట్రాన్ని దోచుకున్న వారూ మమ్మల్ని విమర్శించే పరిస్థితికి వచ్చారు. జైల్లోఉండి కూడా ప్రణబ్‌కు ఓటు వేశారు. ఇప్పుడు ఎఫ్‌డీఐలపై గైర్హాజరయ్యారు. ఆ పార్టీ వాడినని చెప్పుకునే అనకాపల్లి ఎంపీ (సబ్బం హరి) కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్.. ముగ్గురు ఎమ్మెల్యేలను అమ్ముకుంది. ఇలాంటి వాళ్లా మా గురించి మాట్లాడేది?'' అని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ గానీ తాను గానీ నిప్పులా బతికామని, అందుకే ఎవరూ ఏమీ చేయలేకపోయారని పేర్కొన్నారు. అయినా అన్ని పార్టీలకూ టీడీపీయే లక్ష్యంగా మారిందని చెప్పారు. వైసీపీ పుట్టుకే అవినీతి పుట్టుక అని, అది రాష్ట్రాన్ని దోచుకున్న సొమ్ముతో ఏర్పటైన పార్టీ అని తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్ర చరిత్రలోనే ప్రజలకు ఎప్పుడు ఇన్ని కష్టాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి పెరిగి, దిగుబడి తగ్గి, పంటలకు గిట్టుబాటు ధర కరువై రైతులు దిగాలుపడ్డారని వివరించారు. పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడి పోతున్నారని చెప్పారు.

చేతకాని దుర్మార్గపు కిరణ్ సర్కార్ ప్రజల సమస్యల పరిష్కారంలో విఫలమైందన్నారు. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఇందిరమ్మబాట వీడి పొలంబాట పడితే పేద ప్రజలు, రైతుల కష్టాలు తెలుస్తాయనీ, వెంటనే ఆయన ఆ పనిచేయాలని డిమాండ్ చేశారు. పత్తిపంటకు పెట్టుబడి పెరిగి దిగుబడులు తగ్గగా, ఈ యేడు మద్దతు ధర కూడా లభించకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. క్వింటాలు పత్తికి రూ. 5 వేలు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. "ఆరు లాఠీ దెబ్బలు తింటే ఒక యూరియా బస్తా రైతుకు దక్కుతోందని, ఈ కాంగ్రెస్ పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

పత్తి రైతుల సమస్యపై ఆదిలాబాద్ లేక కరీంనగర్‌లో ఒకరోజు ధర్నా చేస్తానని ప్రకటించారు. రుణ మాఫీ సాధ్యం కాదంటూ కాంగ్రెస్, వైసీపీ విమర్శిస్తున్నాయని, ఆ పార్టీలకు దమ్ముంటే రుణమాఫీకి వ్యతిరేకమని ప్రకటించాలని సవాల్ విసిరారు. తన చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు పేదల బాగు కోసం పోరాటం చేస్తానని వెల్లడించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆ పనిని వాయిదా వేయడం వల్ల రూ.2500 కోట్ల కేంద్ర నిధులు వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. ఇదిలాఉండగా, పాదయాత్రగా సాగిన చంద్రబాబుకు ముథోల్, నిర్మల్ నియోజక వర్గాల్లో అపూర్వ స్వాగతం లభించింది. పలు గ్రామాల్లో మంగళ హారతులతో పెద్దఎత్తున మహిళలు ఎదురొచ్చారు. పూలమాలలు వేసి సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు.

"తెలుగుదేశం హయాంలో వేసిన రోడ్లే సార్. అప్పటి రోడ్లపై ఇప్పటి ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా పోయలేదు. వీధి బల్బులు కూడా పెట్టడం లేద''ని కుంటాల మండలం తురాటి గ్రామస్తులు గోడు వెళ్లబోసుకున్నారు. పత్తి పంటకు పెట్టిన పెట్టుబడి రాలేని పరిస్థితి ఉందని, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో తమ పరిస్థితి అధ్వానంగా మారిందని నందన్ గ్రామ మహిళలు వాపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నర్సన్న అనే అంధుడికి రూ.2 వేల ఆర్థిక సహాయం అందించారు.

కాగా, ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రారంభిస్తున్న చంద్రబాబునాయుడి పాదయాత్ర ఆదివారం మాత్రం మధ్యాహ్నం 3.30కి ప్రారంభమైంది. పాదయాత్రలో ఎంపీ నామ నాగేశ్వర్‌రావు, టీడీపీ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. కాగా, భైంసాలో జరిగిన పాదయాత్రలో పాల్గొని ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.