December 12, 2012

నిరుద్యోగికి పరీక్షా కాలం!

రాబోయే రోజుల్లో సమాజంలో ఏయే మార్పులు జరుగుతాయో ముందుగానే అంచనా వేసి, దానికి అనుగుణంగానే రాజకీయ నాయకులు విధాన నిర్ణయాలు తీసుకోవాలి! ఏ కోర్సు చదివితే ఏ ఉద్యోగం రావచ్చు అనే దిశగా విధానాలు ఉండాలి. దీనిని ఏటా సమీక్షించుకోవాలి. అప్పుడే ప్రగతికి బాటలు వేసినట్టు!

నేను ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో ఐటీ, పారా మెడికల్, టూరిజం, ఆర్థిక సేవల రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాను. దానికి తగినట్లు, ఎంబీఏ, ఎంసీఏ, హోటల్ మేనేజ్‌మెంట్, ఐటీ కాలేజీలకు ప్రాధాన్యం ఇచ్చాను. తద్వారా లక్షలాదిమందికి ఉద్యోగాలు వచ్చాయి. విదేశాల్లోనూ మనవాళ్లు ఆంధ్రప్రదేశ్ జెండాను రెపరెపలాడించారు. బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ అవకాశం కల్పించాను. కొంతమందికి అర్హత లేకపోయినా, పదో తరగతి తర్వాతే వారికి పోస్టింగ్ ఇచ్చి, ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసే అవకాశం ఇచ్చాను.

కానీ, రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఐఏఎస్ ఉత్తీర్ణత సాధించాలన్నా మూడు పరీక్షలు లేవు. కానీ, టీచర్ పరీక్షకు మాత్రం మూడు పరీక్షలు పెట్టారు. ఎస్జీటీకి అవకాశం కల్పించకపోతే తాము ఇన్నాళ్లు చదివిందంతా వృథా అవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఆరు లక్షలమంది విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. విద్యార్థుల్లో నిరాశా నిస్పృహలు, భవిష్యత్తు పట్ల భయం కనిపిస్తున్నాయి. బీఈడీ అభ్యర్థులు ఇప్పుడు రూ.2000కు ప్రైవేటుగా ఉద్యోగం చేసుకుంటున్నారు. మరికొంతమంది రైతు కూలీలవుతున్నారు. గంజి తాగి పిల్లల్ని చదివించామని, ఇప్పుడు తమకు ఈ అవస్థలు ఏమిటని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.

అవగాహన లేని పాలకుల వల్లే ఈ దురవస్థ. నిరుద్యోగులకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నా!