December 12, 2012

టీడీపీ అధికారంలోకి వస్తే విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్: చంద్రబాబు

అఖిలపక్షంలో ముందు కాంగ్రెస్ వైఖరి చెప్పాలి
అక్కడే మా అభిప్రాయాన్నీ స్పష్టం చేస్తాం
ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న కేసీఆర్


ఆదిలాబాద్, డిసెంబర్ 12 : "కాంగ్రెస్ పార్టీకి దమ్ము, ధైర్యం ఉంటే అఖిలపక్ష సమావేశంలో ముందుగా తెలంగాణపై తన అభిప్రాయాన్ని చెప్పాలి. అక్కడే మా అభిప్రాయం కూడా చెబుతాం. తెలంగాణ సమస్యను పరిష్కరించిన తర్వాతే అఖిలపక్ష సమావేశం నుంచి బయటకు వద్దాం'' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. టీడీపీ విద్యకు ప్రాధాన్యం ఇస్తుందని, రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్‌లను ఇస్తామని ప్రకటించారు.

పాదయాత్రలో భాగంగా బుధవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజక వర్గంలోని కొత్త వెల్మల్, వెల్మల్ బొప్పారం, పీచర, ధర్మారం, మల్లాపూర్, లక్ష్మణచాంద, తెరిపెల్లి, గాంధీచౌక్‌ల్లో పర్యటించారు. తెలంగాణను ఇవ్వాల్సిన కాంగ్రెస్ నాన్చుడు ధోరణిని అవలంభిస్తూ, టీడీపీని దెబ్బతీసేందుకు కుట్రలు కుతంత్రాలు పన్నుతోందని మండిపడ్డారు. "టీఆర్ఎస్ ఏర్పాటుతో ఎవరూ బాగు పడలేదు. ఆ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రజలను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసుకుని బాగుపడ్డారు.

టీఆర్ఎస్ ఏర్పాటుతో రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలేదు. కేసీఆర్‌కు, ఆయన కొడుకు, అల్లుడు, కూతురుకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయి. నా సభలకు ఇతర గ్రామాలకు చెందిన ఒకరిద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి అల్లరి చేస్తున్నారు. ఇది సబబు కాదు. టీఆర్ఎస్ సిద్ధాంతాలు ఆ పార్టీ చెప్పుకోవచ్చు. మా పార్టీ సిద్ధాంతాలు మేం చెప్పుకుంటాం. ఎవరికి ఓట్లు వేయాలో ప్రజలే నిర్ణయిస్తారు'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ కోసం తమను అడగవద్దని, అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను అడగాలని సూచించారు.

టీఆర్ఎస్ అంటే తిరకాసు పార్టీ అనీ, కేసీఆర్ ఆరు నెలలు ఫాం హౌస్‌లో కుంభకర్ణుడిలా పడుకుని, తర్వాత ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తూ పబ్బం గడుపుకుంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల రుణాలను మాఫీ చేస్తానని తాను చెబితే ఎలా చేస్తారని కాంగ్రెస్, వైసీపీ విమర్శిస్తున్నాయని, ఆ రెండూ దోచుకున్న డబ్బును రికవరీ చేస్తే ఐదుసార్లు రుణాలను మాఫీ చేయవచ్చని చెప్పారు. సీఎం కిరణ్ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్ లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని, వైసీపీ విలువ లేని పార్టీ అని విమర్శించారు.

వార్డు సభ్యులుగా గెలవలేని నాయకులు ఆ పార్టీలో ఉన్నారని, ఆ పార్టీకి ఓట్లు వేస్తే అవి వృథా అవుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసిన జగన్ ఉప రాష్ట్రపతిగా ముస్లిం అభ్యర్థిని బరిలో నిలిపితే ఓటు వేయలేదనీ, ఆ పార్టీకి ముస్లింలపై ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. పాదయాత్ర అడుగడుగునా డప్పు చప్పుళ్లు, మేళ వాయిద్యాలు, మంగళ హారతులతో స్థానికులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. వివిధ గ్రామాల ప్రజలు చంద్రబాబు వద్దకు వచ్చి మళ్లీ మీ ప్రభుత్వం రావాలని.. తమ కష్టాలు తీర్చాలని కోరారు. గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక శాఖతోపాటు మంత్రిని నియమిస్తామని చెప్పారు.

ఆదిలాబాద్ అభ్యర్థిగా పాయల శంకర్
నిర్మల్, డిసెంబర్ 12: ఆదిలాబాద్ శాసన సభ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థిగా పాయల శంకర్‌ను చంద్రబాబు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా నేతలతో బుధవారం ఉదయం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. చంద్రబాబు ఎంపికకు జిల్లా నేతలు ఆమోదం తెలిపారు.