November 16, 2012

మీ బేరసారాల కోసం అవిశ్వాసమా?

మీ బేరసారాల కోసం అవిశ్వాసమా?
వాళ్ల కోసం మేం పెట్టం.. అవసరమైతే ప్రజా సమస్యలపై పెడతాం
చేతకాకుంటే రాజీనామా చేసి పోవాలని కిరణ్ సర్కారుకు సూచన
తెలంగాణకు కేసీఆర్ ఏం ఉద్ధరించారు?.. చేవెళ్లలో చంద్రబాబు గర్జన

రంగారెడ్డి జిల్లా, నవంబర్ 16: బేరసారాల కోసమే కొందరు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని, వారికి బలం ఉంటే గవర్నర్ వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని పడగొట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు సవాలు చేశారు. అవసరమైతే ప్రజాసమస్యలపై తాము అవిశ్వాస తీర్మానం పెడతామే తప్ప వారి కోసం పెట్టబోమని చెప్పారు. 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని దామరగిద్ద, న్యాలట, రామన్నగూడ, ఇబ్రహీంపల్లి, చేవెళ్ల, దేవునిఎర్రవల్లి, ఊరెళ్ల, కొత్తపల్లి క్రాస్‌రోడ్డు, ఎన్కేపల్లి గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు.

సమస్యలను పరిష్కరించడం, ధరలను నియంత్రించడం చేతకాకుంటే తక్షణమే రాజీనామా చేసి వెళ్లిపోవాలని కిరణ్ సర్కారుకు చంద్రబాబు సూచించారు. చేవెళ్ల క్రాస్‌రోడ్డులో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే పన్నుల మీద పన్నులు వేసి కిరణ్ సర్కారు వారిని మరింత ఇబ్బందుల పాలు చేస్తోందన్నారు. కిరణ్‌లాంటి అధ్వాన సీఎంను తాను ఎప్పుడూ చూడలేదని, ఆయన కనీసం హైదరాబాద్‌లో ఘర్షణలను కూడా నియంత్రించలేకపోతున్నారన్నారు. "నేను నిప్పులాంటి మనిషిని. నాకు విశ్వసనీయత లేదంటారా? ఎవరేంటో ప్రజలకు తెలుసు'' అని చంద్రబాబు అన్నారు.

తనకు ఎక్కడో హోటల్ ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారని, అది ఉన్నట్లు నిరూపిస్తే వారికే రాసిస్తానని సవాల్ విసిరారు. తాము అ«ధికారంలోకి వస్తే రైతులకు సోలార్ విద్యుత్ అందజేస్తామని చెప్పారు. కాగా చంద్రబాబు పాదయాత్రకు ఇంటలెక్చువల్ ఫోరం సంఘీభావం తెలిపింది. ఫోరం కో ఆర్డినేటర్ సుబ్బారావు, మాజీ ఐఏఎస్ రాంబాబు, సామాజికవేత్త వెంకటేశ్వరరావు బాబును కలిసి మద్దతు తెలిపారు.
No comments :

No comments :