October 11, 2012

శనగ విత్తి.. బట్టలుతికి.. పదో రోజు ప్రజలతో మమేకం

టీడీపీ అధికారంలోకి వస్తే కరెంటు సమస్య ఉండదు!
పాదయాత్రలో చంద్రబాబు హామీ.. నాకు ఏ కోరికా లేదు
వాస్తవాలు చెప్పడానికే వచ్చాను
పనికి మాలిన ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయండి
శనగ విత్తి.. బట్టలుతికి.. పదో రోజు ప్రజలతో మమేకం

  "నాకు ఏ కోరికా లేదు. మీ కష్టాలు చూడలేకే వచ్చాను. తొమ్మిదేళ్లు నాకు అధికారం ఇచ్చారు. మరో తొమ్మిదేళ్ల నుంచి ప్రతిపక్ష నేతగా ఆదరిస్తున్నారు. పేదల కష్టాలు చూడలేక, మిమ్మల్ని మరింత కష్టాల్లోకి నెడుతున్న ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని వివరించి చైతన్యవంతులను చేయడానికి వచ్చాను. టీడీపీ అధికారంలోకి వస్తే కరెంటు సమస్య లేకుండా చేస్తా. డెంగ్యూ, చికున్‌గున్యా వంటి జబ్బులతో జనం అల్లాడుతున్నారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి బాధ్యత లేదు. ఈ పనికిమాలిన ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలి. నాతో కలిసి రండి'' అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

'వస్తున్నా.. మీ కోసం' అంటూ చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర పదోరోజు గురువారం హనకనహాళ్ నుంచి మొదలైంది. అంతకుముందు వాహనం వద్దే రాయదుర్గం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హనకనహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో సమస్యలను చూసి స్పందించిన చంద్రబాబు.. పాఠశాలలో మరుగు దొడ్లు, తాగునీటి పైపు లైన్‌కు ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి నిధుల నుంచి రూ. 2.50 లక్షలు మంజూరు చేయిస్తున్నట్లు హామీ ఇచ్చారు.సొళ్లాపురం, హనుమాపురం మీదుగా 19.3 కిలోమీటర్లు పాదయాత్ర సాగించిన చంద్రబాబు ఉరవకొండ నియోజకవర్గం నింబగళ్లులో ముగించారు.

పాదయాత్రలో పలువురు వ్యక్తిగత సమస్యలతోపాటు రోడ్లు, కాల్వలు, తాగునీరు, కరెంటు, గ్యాస్ కష్టాలను ఏకరువు పెట్టారు. అనంతరం అదే గ్రామంలో వెంకన్న అనే వ్యక్తి ఇంటికి చంద్రబాబు వెళ్లారు. ఆ ఇంట్లో ఐదుగురు వికలాంగులు ఉండడం చూసి చంద్రబాబు చలించిపోయారు. ఫ్లోరైడ్ నీటి వల్ల చాలామంది చిన్న వయసులోనే వృద్ధాప్యాన్ని తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొళ్లాపురంలో ఓ రైతుకు చెందిన పొలంలో చంద్రబాబు పప్పు శనగ విత్తారు. హనకనహాళ్ సమీపంలోని వంకలో బట్టలు ఉతుకుతున్న రజకుల వద్దకు చంద్రబాబు వెళ్లారు.

వారి సమస్యలు తెలుసుకుని.. వారితో కలిసి బట్టలు ఉతికారు. పదో రోజు యాత్రలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. బాబు పాదయాత్ర సొళ్లాపురానికి చేరుకోగానే కృష్ణమాదిగ అక్కడకు వచ్చారు. అక్కడే సభలో సంఘీభావం ప్రకటించారు. విశ్రాంతి తీసుకోవాలని పలువురు నాయకులు కోరుతున్నా చంద్రబాబు ఖాతరు చేయడం లేదు. కాగా, పాదయాత్రలో పలువురు పువ్వులు చల్లడంతో చంద్రబాబు కళ్లకు ఇన్‌ఫెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, గురువారం గంట ఆలస్యంగా 11 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు.

అన్నింటా అక్రమాలే
ప్రభుత్వ తీరును చంద్రబాబు ఎండగట్టారు. "అన్నింటా అక్రమాలే. ఇన్‌పుట్ సబ్సిడీ రాదు. రైతులకు పంటల బీమా అందదు. ఇందిరమ్మ ఇళ్లలోనూ దొంగ బిల్లులతో దోచేశారు. గనుల పేరుతో వేల కోట్లు దోచేశారు. అటువంటి వారికే అధికారం ఇస్తున్నారు. మీలో చైతన్యం రావాలి. సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మీదే'' అని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ ఇప్పటికే ఢిల్లీలో జెండా పీకేసిందని, ఏనాడైనా కాంగ్రెస్‌లో విలీనమవుతుందని, ఈ మేరకు ఇప్పటికే మంతనాలు జరుగుతున్నాయని చెప్పారు. అక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు చంద్రబాబు దృష్టికి తీసుకు రాగా 'ఏమి చేయాలో మీరే చెప్పండ'ని ఆయన ఎదురు ప్రశ్నించారు.

ఇందుకు మూకుమ్మడిగా 'మీరు సీఎం అయితేనే మాకు న్యాయం జరుగుతుంద'ని పలువురు బదులిచ్చారు. దీంతో, చంద్రబాబు స్పందిస్తూ 'మీరు అనుకున్నది జరుగుతుంది. అధికారంలోకి వచ్చేది టీడీపీయే. పార్టీ అధికారంలోకి వస్తే.. రైతులను రుణ విముక్తులను చేస్తాం. హెల్త్ ఎమర్జెన్సీ పెట్టి గ్రామీణ ప్రజలు ఏమాత్రం అనారోగ్యం పాలు కాకుండా చర్యలు తీసుకున్న ఘనత కూడా టీడీపీదే'నని చంద్రబాబు చెప్పారు.

"సార్! మా గ్రామంలో రెడ్ల దౌర్జన్యం కొనసాగుతోంది. కార్డు ఇవ్వరు. పింఛను అందదు. మా పేర్లతో వచ్చిన బిల్లులను కూడా వారే కాజేశారు. అదేమని అడిగితే తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో కొట్టిస్తున్నారు'' అంటూ హనకనహాళ్ గ్రామానికి చెందిన నాగార్జున అనే యువకుడు చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు.

దీంతో, ఆయన స్పందిస్తూ "పేదలపై దౌర్జన్యం చేస్తే వదిలి పెట్టను. పెత్తందార్ల వ్యవస్థను మళ్లీ తీసుకు రావాలనుకుంటున్నారా? ఇలా చేస్తే సహించేది లేదు'' అన్నారు. హనకనహాళ్‌వైసీపీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి స్వగ్రామం. అక్కడ ఆయన వర్గీయులే దౌర్జన్యాలు చేస్తున్నారని, అక్రమ కేసులు పెట్టిస్తున్నారని స్థానికులు ఆరోపించగా, "పోలీసులూ! మీరు కూడా ఆలోచించండి. అధికారం శాశ్వతం కాదు. న్యాయబద్ధంగా వ్యవహరించండి. మీ ఉద్యోగాలను ఎవరూ తీసేయలేరు'' అని చంద్రబాబు సూచించారు. (andhrajyothi)
No comments :

No comments :