October 27, 2012

'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రను ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు పునఃప్రారంభం

మీ కోసమే వస్తున్నా
నేటి మధ్యాహ్నం నుంచి పునఃప్రారంభం
ఆదివారం 8-10 కిలోమీటర్లు పాదయాత్ర
2,3 రోజులు విశ్రాంతి తీసుకోవాలన్న వైధ్యులు
కొనసాగింపునకే చంద్రబాబు నిర్ణయం
బాబుకు టీడీపీ నేతల పరామర్శల వెల్లువ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రను ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు పునః ప్రారంభించాలని నిర్ణయించారు. ఆదివారం ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేయనున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి శనివారం రాత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. డాక్టర్లు చంద్రబాబును పరామర్శించిన తర్వాత పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

చంద్రబాబు ప్రస్తుతం కండరాల నొప్పితో బాధ పడుతున్నారని, బీటీ రోడ్డుపై నడవడం వల్ల ఈ నొప్పి వచ్చిందని డాక్టర్లు చెప్పారని తెలిపారు. దీంతో, చంద్రబాబు పాదయాత్ర చేసే మార్గంలో రోడ్డు పక్కన మట్టి రోడ్లు వేయించాలని కలెక్టర్‌ను ఆయన కోరారు. ఒకవేళ ప్రభుత్వం చేయకపోతే, తమ కార్యకర్తలే మట్టి వేస్తారని చెప్పారు. కాగా, మరో రెండు మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా, పార్టీ సీనియర్లు పదే పదే కోరినా యా త్ర కొనసాగింపునకే చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు వివరించాయి.

మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణంలో శుక్రవారం రాత్రి వేదిక కూలడంతో చంద్రబాబుకు గాయాలైన సంగతి తెలిసిందే. నడుం దగ్గర హిప్ జాయింట్ భాగం ఒత్తిడికి గురైంది. అక్కడ కొంత వాపు వచ్చింది. రాయచూర్ నవోదయ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్లు శుక్రవారం అర్ధరాత్రి వచ్చి చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించి ఎక్స్‌రే తీశారు. ఎలాంటి ఫ్రాక్చర్లు లేవని ప్రకటించారు. నరాలు ఒత్తిడికి గురి కావడంతో నడుము భాగంలో కొంత వాపు వచ్చిందని చెప్పారు. నడిస్తే మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కనీసం మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

దీంతో, శనివారం ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. ఇక, చంద్రబాబు కుటుంబ వైద్యులు నరేంద్రనాథ్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి శనివారం పరీక్షలు నిర్వహించారు. అలాగే, శనివారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శామ్యూల్ చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించారు. నడుముకు లుంబో సాక్రల్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.

గద్వాలకు భువనేశ్వరి, లోకేష్, బ్రహ్మణి..
చంద్రబాబు గాయపడిన విషయం తెలిసిన వెంటనే ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ హుటాహుటిన గద్వాలకు చేరుకున్నారు. చంద్రబాబు బస చేసిన రైస్‌మిల్ వద్దకు చేరుకున్నారు. శనివారమంతా ఇక్కడే ఉండిపోయారు. లోకేష్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో మాట్లాడుతూ కనిపించారు. చంద్రబాబు కోడలు బ్రహ్మ ణి సాయంత్రం గద్వాలకు చేరుకుని మామయ్యను పరామర్శించారు. బాబును సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ శనివారం పరామర్శించారు.

సినీ నిర్మాతలు దిల్‌రాజు, బండ్ల గణేశ్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిలతో కలిసి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ దాదాపు గంటపాటు చంద్రబాబు బస చేసిన ప్రత్యేక వాహనంలో ఉన్నారు. అనంతరం, విలేకరులతో మాట్లాడుతూ, మామయ్య త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. పాలన గాడి తప్పిన రాష్ట్రానికి చంద్రబాబు నాయక త్వం కావాలన్నారు. మీరు పాదయాత్రలో పాల్గొంటారా? అన్న ప్రశ్న కు షూటింగ్ తేదీలను బట్టి భాగస్వామిని అవుతానని చెప్పారు.

టీడీపీ నేతల పరామర్శలు
చంద్రబాబును పరామర్శించేందుకు శనివారం పలువురు సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు గద్వాలకు చేరుకున్నారు. పార్టీ నేతలు కోడెల శివప్రసాదరావు, బొజ్జల గోపాలకృష్ణరెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, తీగల కృష్ణారెడ్డి, దాడి వీరభద్రరావు, టీడీ జనార్దన్‌రావు, వీవీఎస్ చౌదరి బాబును పరామర్శించారు. రాత్రి 7 గంటలకు జిల్లా ఎమ్మెల్యేలు పరామర్శించారు. టీడీపీ హయాంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ పాదయాత్రకు తమ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, కానీ.. బాబు యాత్రకు రక్షణ ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని కోడెల శివప్రసాదరావు విమర్శించారు. అస్వస్థతకు గురైన వైఎస్‌కు అప్పట్లో 24 గంటలూ వైద్య సహాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.

మంత్రి అరుణకు చుక్కెదురు
టీడీపీ అధినేత చంద్రబాబును పరామర్శించేందుకు మంత్రి డీకే అరుణ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే భరత్‌సింహారెడ్డి విఫలయత్నం చేశారు. చంద్రబాబును కలిసేందుకు టీడీపీ నాయకులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ప్రతిపక్ష నా యకుడు తన నియోజకవర్గంలో గాయపడిన నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు తాము ప్రయత్నం చేస్తే టీడీపీ ఎమ్మెల్యేల వైఖరి శోచనీయంగా ఉందని అరుణ, భరత్‌సింహారెడ్డి విమర్శించారు.
No comments :

No comments :