October 1, 2012

2014 తర్వాత పెనుమార్పులు...విశాలాంధ్ర

 

 

2014 తర్వాత పెనుమార్పులు

Mon, 24 Sep 2012, IST    
  • 2 నుంచి 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర : చంద్రబాబు ప్రకటన
హైదరాబాద్‌(వి.వి) : దేశం, రాష్ట్రంలో 2014 తరువాత పెనుమార్పులు సంభవిస్తాయని టిడిపి అధ్యక్షులు ఎన్‌.చంద్రబాబునాయుడు అభిప్రాయ పడ్డారు. యుపిఎ స్థితి రోజురోజుకూ దిగజారు తున్నదని, ఎన్‌డిఎ పరిస్థితి కూడా అదేనని ఆయన అన్నారు. సోమవారం ఎన్‌టిఆర్‌ భవన్‌లో పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ప్రారంభో పన్యాసం చేశారు. మూడవ ఫ్రంట్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. యునైటెడ్‌ ఫ్రంట్‌, నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాల ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ కీలక భూమిక పోషించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మూడు దశాబ్ధాలుగా కాంగ్రెస్‌కు ఎదురొడ్డిన ప్రాంతీయ పార్టీ ఒక్క టిడిపి మాత్రమేనని ఆయన చెప్పారు. ఇపుడు కూడా అలాంటి పాత్ర పోషించనుందని ఆయన తెలిపారు. పిఆర్‌పి దారిలోనే టిఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సిపిలు ప్రయత్ని స్తున్నాయని ఆయన చెప్పారు. విలీనానికి టిఆర్‌ఎస్‌ చర్యలు ప్రారంభించిందని ఆయన అన్నారు. ఇక భవిష్యత్తు టిడిపిదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి సహా అన్ని వర్గాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల్చుకుతింటున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సహా అన్ని వ్యవస్థలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. డీజిల్‌ ధరల పెంపువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.800 కోట్ల ఆదాయం సమకూరుతుండగా ఆర్‌టిసి బస్సు చార్జీలు పెంచడం దారుణమని ఆయన పేర్కొన్నారు. వంటగ్యాస్‌పై పరిమితులు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. పెంచిన బస్సు చార్జీలు వెంటనే తగ్గించవలసిందిగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరువుపై స్పందించని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)ను స్వాగతించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌డిఐల వల్ల దేశంలోని కోటిన్నర కిరణాదుకాణాలు మూతపడతాయని, నాలుగు కోట్ల మంది జీవనోపాధి కోల్పోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల దేశాన్ని లూటీ చేసేందుకు ఎక్కువ అవకాశం వుందని ఆయన అన్నారు. దేశ వనరులను బహుళ జాతి కంపెనీలకు అప్పగించి కాంగ్రెస్‌ పాలకులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా దోపిడీకి
అవకాశం కల్పించి యుపిఎ ప్రభుత్వం చేతులు ముడుచుకు కూర్చుందని ఎద్దేవా చేశారు. విద్యుత్‌ రంగాన్ని నిర్వీర్యం చేసిన ఫలితంగా చిన్న పరిశ్ర మలు మూతపడి 40 లక్షల మంది ఉపాధి కోల్పోయే దారుణమైన దుస్థితి నెలకొన్నదన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, గృహవినియోగదారులు నానా ఇబ్బందుల పాలయ్యారన్నారు. ఇప్పటికే అనేకమార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారని, మరోసారి రూ.600 కోట్ల భారం మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూపురం నుండి యాత్ర : ఈ సమస్యపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అక్టోబర్‌ రెండవ తేదీ నుంచి అనంతపురం జిల్లా హిందూపురం నుంచి యాత్ర చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. జనవరి 26న యాత్ర ముగుస్తుందని తెలిపారు. యాత్రలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. మూడు దశాబ్దాలుగా ప్రజలు తమకు అండగా నిలిచారన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ఇది తమ ప్రయత్నమని ఆయన తెలిపారు. పార్టీ విస్తృత సమావేశం ముగిసిన తరువాత తెలంగాణపై చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. నందమూరి హరికృష్ణ సహా ముఖ్య నాయ కులంతా హాజరయ్యారు. మంగళవారం సంస్థాగత ఎన్నికల అంశాన్ని చర్చిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.
బాబు యాత్రకు 'వస్తున్నా-మీకోసం' పేరు ఖరారు : టిడిపి అధ్యక్షులు ఎన్‌.చంద్రబాబు ప్రతి పాదితయాత్ర పేరు ఖరారైంది. 'వస్నున్నా-మీకోసం' అని యాత్ర పేరును పార్టీ ఖరారు చేసింది. అక్టోబర్‌ 2వ తేదీన అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రారంభమై జనవరి 26న ముగుస్తుంది. సోమవారం నాడిక్కడ పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత సమావేశం పేరును ఖరారు చేసింది. పక్షం రోజులుగా పేరుపై పలు దశల్లో చర్చలు జరిపిన పార్టీ 'వస్తున్నా-మీకోసం'ను పేరును ఖరారు చేసింది.
27న మైనారిటీ డిక్లరేషన్‌ : మైనారిటీల సమస్యలపై ఈ నెల 27వ తేదీన టిడిపి డిక్లరేషన్‌ను ప్రకటించాలని నిర్ణయించింది. పార్టీ ప్రధానకార్యదర్శి లాల్‌జాన్‌ పాష సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో విషయాన్ని ప్రకటించారు. ఈ నెల 26న పార్టీకి సంబంధం లేకుండా ముస్లిం పెద్దలతో సమావేశమై వారి సలహాలు సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. సదస్సులో ఈ అంశాలను చర్చించి డిక్లరేషన్‌ను ప్రకటిస్తామని ఆయన వివరించారు.
30న సీమాంధ్ర, 4న తెలంగాణాలో టిడిపి ఎన్నికలు : టిడిపి ఎన్నికలు ఈ నెల 30వ తేదీన సీమాంధ్రలో, తెలంగాణాలో అక్టోబర్‌ 4వ తేదీన జరుగుతాయని పోలిట్‌బ్యూరో సభ్యుడు కె.ఎర్రంనాయుడు చెప్పారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. అక్టోబర్‌ 2వ తేదీ నుండి 20వ తేదీ వరకు పార్టీ గ్రామ, మండల స్థాయి కమిటీల ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వరకు పల్లె పల్లెకు తెలుగుదేశం పేరిట కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.
No comments :

No comments :