October 13, 2012

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర 13.10.2012

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర
టీడీపీ అధికారంలోకి వస్తే ఏడాదికి 10 సిలిండర్లు
వైఎస్సార్‌సీపీవి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు 

కిరణ్ సర్కార్ అసమర్థ పాలన వల్లే ప్రజలు కష్టాలు పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఫీజు రియింబర్స్‌మెంట్, పదో తరగతి చదివిన వారికి సైతం ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ ఇవ్వని పక్షంలో నిరోద్యోగ భృతి కల్పిస్తామన్నారు.

శనివారం ఉదయం ఉరవకొండ నియోజకవర్గం గడేహోతు నుంచి చంద్రబాబునాయుడు 12వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. గొర్రెలు కాసే మహిళలు ఈ గ్రామంలో బాబును కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నీతివంతమైన పాలనపై యువత దృష్టిసారించాలని అన్నారు. సోనియా గాంధీ చెప్పినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అదనపు సిలిండర్లు ఇవ్వడం లేదని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికి కుటుంబానికి10 సిలిండర్లను ఇస్తామని, నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వితంతువులకు, వృద్ధులకు రూ. 600 పింఛను సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇన్‌పుట్ సబ్సిడీని ప్రవేశపెట్టింది టీడీపీయేనని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో అప్పులు లేని వారు ఎవరైనా ఉంటే వారు పుణ్యపురుషులే అని ఆయన అన్నారు. అవిశ్వాసం పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బేరసారాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొంటున్నారని చంద్రబాబు విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోదని ఆయన ధ్వజమెత్తారు. తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఢిల్లీలో బేరసారాలకు దిగుతారని, వారు చేసే పాపకార్యలకు తాము సహకరించాలా అని ప్రశ్నించారు. వైఎస్సార్ పార్టీ నేతలు ప్రణబ్‌కు ఓటు వేసి ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

"వస్తున్నా...మీకోసం'' కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ఉరవకొండ నియోజకవర్గంలోని గడేహోతు నుంచి పొట్టిపాడు మీదుగా ఛామాపురం చేరుకుని చంద్రబాబు అక్కడ భోజనం చేశారు. అనంతరం కనకొండ్ల, గుంతకల్లు వరకు పాదయాత్రగా వెళ్లారు. హనుమాన్ సర్కిల్‌లో బాబు రాత్రికి బస చేయనున్నారు. ఈ రోజు మొత్తం 20.3 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు. కాగా నిన్న స్వల్ప అస్వస్థతకు గురైన చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి కలుసుకున్నారు.
No comments :

No comments :