October 13, 2012

ఆ కళ్లకు ఏ కల అతకాలి!

పల్లెలు దాటి, మండలాలు దాటి, ఇకనిప్పుడు జిల్లానూ దాటి పోతున్నాను. ఇన్నాళ్లలో లక్షలాది మందిని కలిశాను. వేలాది గడపలు తొక్కాను. వందకుపైగా సభల్లో మాట్లాడాను. జనం చెప్పిందల్లా విన్నాను. అంతకన్నా వాళ్ల అగచాట్లను దగ్గరగా చూశాను. పల్లెల్లో లాగే వారి బతుకుల్లోనూ చీకట్లు అలుముకున్నట్టనిపించింది.

పొలం గట్లపై దిగాలుగా కూర్చున్న రైతులు, ఏ ఆసరా లేక కూలిపోతున్న కుటుంబాల నుంచి, వృత్తులు పోయి వ్యథ చెందుతున్న మనుషులు, గుక్కెడు నీటి కోసం అంగలారుస్తున్న తల్లుల దాకా ఒక బాధా కాదు..ఒక తలపోతా కాదు..హాస్టల్‌కో, బడికో వెళ్లినప్పుడు నా వైపు ఆశగా చూసే చిన్నారుల కళ్లకు ఇకనే కలను అతకగలను!

ఏదీ కలిసిరాక, చివరకు కడుపున పుట్టిన బిడ్డలూ చేతి కిందకు రాక ఆ అమ్మానాన్నలు పడుతున్న రంపపు కోతను చూడలేకపోయాను.

"చదువుంది.. కొలువు లేదు..చేతులున్నాయి.. పని లేదు..''. వజ్రకరూరు వైపుగా వెళుతూ గడేహోతూరు, పొట్టిపాడు గ్రామాలకు వెళ్లినప్పుడు ఎదిగొచ్చిన కొడుకుల గురించి బెంగపడుతున్న జనం కనిపించారు. వారి పక్కనే అపరాధుల్లా నేలవైపు చూస్తూ కొంతమంది యువకులు నిలబడ్డారు. చదివినా ఉద్యోగాలు రాక గ్రామంలో ఏదో పని చేసుకు బతుకుతున్నామని వారంతా చెప్పుకొచ్చారు.

"సార్ మా కుటుంబాలకు కొంత భూమి ఉంది. కానీ, ఇంటిల్లిపాది పనిచేసేందుకు అది చాలదు. సాగు చేసినా మిగిలేదేమీ ఉండటం లేదు. వలస పోదామంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసేదెవరు?'' అని ఆ నిరుద్యోగులు అడుగుతుంటే, ఇదంతా సమాజం మంచికి జరగడం లేదనిపించింది.

ఏ 'కిరణాలూ' తమకు తెలియవని, డిగ్రీలు చదివినా దిక్కు లేదని వారు చెబుతుంటే వీళ్ల ఆగ్రహం ఏ అశాంతికి బీజం నాటుతుందోనని కలవరపడ్డాను. వాళ్ల తాలూకు బంధువులో, బాబాయిలో, వరసకు అన్నయ్యలో పదేళ్ల కిందట హైదరాబాద్‌కో, అమెరికాకో వెళ్లినట్టు తెలిసినప్పుడు.. ఈ యువకులు చేసిన పాపం ఏమిటనిపించింది. నా హయాంలో జరిగిన మంచిని చూసి సంతోషించనా! ఒక తరం తరమే తల్లడిల్లుతున్నందుకు చింతించనా!
No comments :

No comments :