December 4, 2013

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే మహాధర్నా

 కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ తీర్పు వల్ల 14 జిల్లాల్లో తాగు,సాగు నీటి సమస్యలు తలెత్తుతాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజ్ వద్ద చేపట్టిన మహాధర్నాలో బాబు మాట్లాడుతూ తీర్పును రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే మహాధర్నా చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఈ తీర్పు వల్ల మన హక్కులను కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

కరువులు, వరదల సమయంలో ఇబ్బందులు పడుతున్నది మనమే అని, కృష్ణానదికి తెలుగు ప్రజలకు విడదీయరాని సంబంధం ఉందన్నారు. కృష్ణా నదిపై ఇప్పటి వరకు రెండు ట్రిబ్యునళ్లు వేశారని తెలిపారు. దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా బ్రిజేష్‌కుమార్ జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. 78 సంవత్సరాల డేటా 75 శాతం నీటి లభ్యతతో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేస్తే....బ్రిజేష్ ట్రిబ్యునల్ 47 ఏళ్ల డేటా 65 శాతం నీటి లభ్యతను పరిశీలించి కేటాయింపులు చేయడం సరికాదన్నారు.